కాంగ్రెస్‌ను కాంగ్రెసే ఓడించుకోబోతోందా?

July 21, 2018


img

వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని టి-కాంగ్రెస్‌ నేతలు పదేపదే చెప్పుకొంటున్నారు. కానీ వారి తీరు చూస్తుంటే తమ పార్టీ గురించి వారు చెప్పుకొనే ఒక మాట పదేపదే గుర్తుకురాకమానదు. “ఏ ఎన్నికలలోనైన కాంగ్రెస్‌ పార్టీని ఏ పార్టీ ఓడించలేరు. కాంగ్రెస్‌ తనను తాను ఓడించుకొన్నప్పుడే ఇతర పార్టీలు విజయం సాధిస్తుంటాయి.” టికెట్ల కోసం తెలంగాణా కాంగ్రెస్‌ నేతల కీచులాటలు చూస్తుంటే ఇది అక్షరాల నిజమనిపిస్తుంది. వారు తెరాసను ఓడించడం సంగతి ఎలా ఉన్న తమ పార్టీని తామే ఓడించుకోవడానికి సర్వసన్నధంగా ఉన్నట్లు కనబడుతున్నారు. 

ఇటీవల భువనగిరిలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో ఏఐసిసి కార్యదర్శి సమక్షంలోనె ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకొన్నారు. తమ అభ్యర్ధులకే టికెట్లు ఇవ్వాలని ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం సీటు కోసం కీచులాడుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక సర్వే సత్యనారాయణ, వి.హనుమంతరావు వంటి కొందరు సీనియర్ నేతలు తమ మద్దతు ఎవరికో ప్రకటిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. 

తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్‌ నేతల మద్య కూడా టికెట్ల పోటీ జోరందుకొంది. మహబూబాబాద్ నుంచి లోక్ సభకు పోరిక బలరాం నాయక్(మాజీ ఎంపి), పినపాక నుంచి శాసనసభకు రేగా కాంతారావు( మాజీ ఎమ్మెల్యే)  పోటీ చేయబోతున్నామని వారే మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించుకొన్నారు. తమ స్థానాల నుంచి పార్టీలో మరెవరో పోటీ చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తమ అనుచరులకు, మీడియా ద్వారా తమ నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ తమ అధిష్టానానికి చిన్న హెచ్చరిక కూడా చేయడం విశేషం. ఒకవేళ కాంతారావుకి టికెట్ ఇవ్వనట్లయితే వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయనని ప్రకటించారు. అంటే తమిద్దరికీ తప్పనిసరిగా టికెట్స్ ఇవ్వాలని లేకుంటే ఆ రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్‌ విజయానికి సహకరించబోమని వారు హెచ్చరిస్తున్నట్లే ఉంది. 

తెలంగాణా కాంగ్రెస్‌ పార్టీలో ఈవిధంగా ఎవరికీ వారు తాము పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించుకొంటూ, పార్టీ అధిష్టానానికి, పార్టీలో తమ ప్రత్యర్ధులకు సవాళ్ళు విసురుకొంటుంటే టిపిసిసి వారిని వారించలేకపోతోంది. ఒకపక్క టికెట్ల కోసం కీచులాడుకొంటూనే తెరాసను ఓడించి తీరుతామని చెప్పడం మరిచిపోరు. అదే విచిత్రం.


Related Post