అవిశ్వాసం అలా ముగిసింది కానీ...

July 21, 2018


img

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్ సభలో 12 గంటలపాటు చర్చ జరిగిన తరువాత ఓటింగ్ నిర్వహించగా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 126 మంది, మోడీ సర్కార్ కు అనుకూలంగా 325 మంది ఓట్లు వేయడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 

తెరాస సభ్యులు ఈ చర్చలోపాల్గొని అటు మోడీ, ఇటు చంద్రబాబు సర్కార్లను ఎండగట్టిన తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఓడిశాకు చెందిన బిజెడి చర్చ మొదలవగానే సభ నుంచి వాకౌట్ చేసింది. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వంలో భాగస్వామిగా, మిత్రపక్షంగా ఉన్న శివసేన నిత్యం మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తుంటుంది. కానీ భాజపా అభ్యర్ధన మేరకు నిన్న లోక్ సభ కార్యక్రమాలకు హాజరుకాలేదు. 

అవిశ్వాస తీర్మానం ముఖ్యోద్దేశ్యం ఏపికి విభజన హామీలను అమలుచేయనందుకు కేంద్రాన్ని నిలదీయడం. తెదేపా ఎంపిలు ఆ పని చాలా సమర్ధంగానే చేశారు. అయితే ఆ తరువాత జరిగిన చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీతో సహా వివిధ పార్టీల సభ్యులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో అన్ని సమస్యలను ప్రస్తావిస్తూ సుదీర్గ ప్రసంగాలు చేయడంతో తెదేపా లేవనెత్తిన సమస్య తీవ్రత తగ్గిపోయి, మిగిలిన అంశాలు హైలట్ అయ్యాయి. ఆయా అంశాలపై యధాప్రకారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకొన్నారు. 

ఈ చర్చలో రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీలు చేసిన ప్రసంగాలు విన్నప్పుడు, దీనిని కాంగ్రెస్-భాజపాల మద్య ఆధిపత్యపోరుగా వారు భావిస్తున్నట్లున్నారు తప్ప ఏపి సమస్యలపై వారిరువురికీ ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం అయ్యింది. 

అవిశ్వాస తీర్మానంపై రోజంతా జరిగిన చర్చకు జవాబిస్తూ ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగంలో అది మరింత స్పష్టంగా కనబడింది. ప్రతిపక్షాలు తమ శక్తి ఏమిటో తెలుసుకోకుండా చాలా అహంకారంతో తన ప్రభుత్వాన్ని కూల్చేయాలనే దురుదేశ్యంతో ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని మోడీ అనడం గమనిస్తే, అయన దీనిని ఏపికి సంబందించిన వ్యవహారంగా కాక కాంగ్రెస్-భాజపాల మద్య జరిగిన ఆధిపత్యపోరుగా భావించారని అర్ధం అవుతోంది. ఈ చర్చకు అయన చెప్పిన జవాబు ఏపి ప్రజల మనసులను మరింత గాయపరిచినట్లుంది. అవిశ్వాస తీర్మానం ఎలాగూ వీగిపోతుందని అందరికీ ముందే తెలుసు. కానీ దానిపై చర్చ సందర్భంగా వివిధ పార్టీల అంతరంగాలు, వైఖరి బయటపడ్డాయి.  



Related Post