అవిశ్వాస తీర్మానం..అందరినీ కదిపింది

July 20, 2018


img

మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వలన ఏపికి కొత్తగా వచ్చేది ఏమీ ఉండదు. అది పార్టీల మద్య ఆధిపత్యపోరు మాత్రమే కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రధానపార్టీలు ఒకదానిని ఒకటి వేలెత్తి చూపించుకొని విమర్శించుకొనేందుకు కావలసినంత ‘సరుకు’ అందిస్తుందని చెప్పవచ్చు. అక్కడ లోక్ సభలో కాంగ్రెస్, భాజపా, తెదేపా, తెరాసలు ఒకదానిపై మరొకటి తీవ్ర విమర్శలు గుప్పించుకొంటుంటే, ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో కూడా ఆయా పార్టీల నేతలు తమ నోటికి పని చెపుతున్నారు. 

కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ, “నాలుగేళ్ళుగా గుర్తుకురాని ఏడు ముంపు మండలాలు మీకు ఇప్పుడే ఎందుకు గుర్తుకువచ్చాయి? ప్రధాని నరేంద్రమోడీని సిఎం కెసిఆర్ అనేకసార్లు కలిసారు. అప్పుడు ముంపు మండలాలను వెనక్కు తిరిగి ఇచ్చేయాలని అడిగి ఉండవచ్చు కదా? బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట వద్ద కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి ఇంతకాలం కేంద్రాన్ని అడగకుండా మౌనంగా కూర్చొని ఇప్పుడు చివరి సంవత్సరంలో లోక్ సభలో చిందులు వేసి ఏమి ప్రయోజనం?” అని ప్రశ్నించారు. 

ఇక రాష్ట్ర విభజన గురించి ఈరోజు లోక్ సభలో తెదేపా సభ్యులు చేసినవాదనలను తెరాస అక్కడే గట్టిగా ఖండించింది. రేపటి నుంచి తెరాస నేతలు దీనిపై మీ వైఖరి ఏమిటని టిటిడిపి నేతలను నిలదీయకమానరు. కనుక అది వారికి ఇబ్బందికరమే. 

ఈరోజు లోక్ సభలో రాహుల్ గాంధీ తన ప్రసంగం ముగించిన తరువాత వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కౌగలించుకొన్నారు. భాజపా-తెరాసల మద్య రహస్య అవగాహన ఉందని ఆరోపిస్తున్న టి-కాంగ్రెస్ నేతలను నిలదీయడానికి తెరాసకు రాహుల్ గాంధీ చక్కటి అవకాశం కల్పించారు. ఇక రేపటి నుంచి ఏపిలో తెదేపా-వైకాపా-భాజపా మద్య రాజకీయ చదరంగం మరింత రంజుగా సాగే అవకాశం ఉంది. 


Related Post