ప్రాజెక్టు కట్టాలంటే 30 ఏళ్ళు అవసరం లేదు: హరీష్

July 19, 2018


img

తెలంగాణా సాగునీటిశాఖ మంత్రి కె.హరీష్ రావు రాష్ట్రంలో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, “గతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి కనీసం 20-30 ఏళ్ళు సమయం తీసుకొనేవారు. పాలకుల నిర్లక్ష్యం, అశ్రద్ద కారణంగా ఏళ్ళ తరబడి నిర్మాణపనులు సాగుండేవి. కానీ తెలంగాణా ఏర్పడి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాళేశ్వరం వంటి బారీ ప్రాజెక్టులు కూడా 20 నెలలలోపుగానే పూర్తిచేస్తున్నాము. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ఏడాది వ్యవధిలోనే పూర్తి చేసి నీళ్ళు కూడా విడుదల చేస్తున్నాము. ఈ దసరా నుంచి గోదావరి నీళ్ళు సరఫరా మొదలవబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడాము. ఒకసారి రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించాలని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు,” అని చెప్పారు. 

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మంత్రి హరీష్ రావు చెప్పింది అక్షరాల నిజమని చెప్పడానికి ఇక్కడ చేవెళ్ళ-ప్రాణహిత, అక్కడ ఏపిలో పోలవరం ప్రాజెక్టులు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. దశాబ్దాలుగా వాటి నిర్మాణపనులు సాగుతూనే ఉన్నాయి...ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ ఆ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాలేదు. వాటి వలన రాజకీయ నాయకులు, గుత్తేదారులు బాగుపడ్డారే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ కలుగలేదు. కానీ చిత్తశుద్ధి ఉంటే ఎంత పెద్ద ప్రాజెక్టునైనా ఒకటిరెండేళ్ళలోపు నిర్మించవచ్చని నిరూపించి చూపుతోంది తెరాస సర్కార్. కనుక ఈ క్రెడిట్ పూర్తిగా ముఖ్యమంత్రి కెసిఆర్, సాగునీటిశాఖ మంత్రి కె.హరీష్ రావు, ఆ శాఖా అధికారులు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కంపెనీలు వారి కార్మికులకే దక్కుతుంది. అందుకు వారందరికీ అభినందనలు. 


Related Post