కాంగ్రెస్ లో తెలుగువారికి చోటు లేదా?

July 18, 2018


img

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ నేతలు పదేపదే చెప్పుకోవడం అందరూ వినే ఉంటారు. కానీ వారిలో ఎవరూ కూడా జాతీయస్థాయిలో పార్టీలో పనిచేయడానికి అర్హులుకారని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లున్నారు. అందుకే అయన మంగళవారం కొత్తగా ఏర్పాటుచేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ ఒక్కరినీ సభ్యులుగా తీసుకోలేదు. వర్కింగ్ కమిటీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో కలిపి మొత్తం 23 మంది సభ్యులు, మరో 19 మంది శాశ్విత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. కనీసం ఆ ఆహ్వానితుల జాబితాలోనైనా తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతల పేర్లు ఉన్నాయో లేదో చూడాలి. 

కాంగ్రెస్ పార్టీ నిన్న మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో వర్కింగ్ కమిటీ పేర్లను పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్, మోతీలాల్ వోరా, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, ఎకె అంటోనీ, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, ఊమెన్ చాందీ, తరుణ్ గొగోయ్, సిద్దరామయ్య, ఆనంద్ శర్మ, శైలజ, ముకుల్ వాస్నిక్, అవినాష్ పాండే, కేసి వేణుగోపాల్, దీపక్ బబారియా, టి.సాహు, రఘువీర్ మీనా, గైకంగం, అశోక్ గెహ్లాట్ లను వర్కింగ్ కమిటీలో సభ్యులుగా నియమించారు. వారిలో దాదాపు అందరూ దశాబ్దాల తరబడి సోనియాగాంధీ చుట్టూ ఉన్నవారే.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తరువాత పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసి యువతరానికి అవకాశం కల్పిస్తారని చాలా జోరుగా ప్రచారం జరిగింది. అందుకే పార్టీలో సీనియర్స్ అయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు సీనియర్లకే ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు వారిని కాదని పార్టీలో ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని భయంతోనే వర్కింగ్ కమిటీలో మళ్ళీ వాళ్ళనే తీసుకొన్నట్లున్నారు. ఆ కమిటీలో ఒక్క తెలుగు కాంగ్రెస్ నేతకు అవకాశం కల్పించకపోవడం గమనిస్తే తెలుగు రాష్ట్రాల పట్ల కాంగ్రెస్ అధిష్టానానికి ఎంత చులకన భావం ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఏమంటారో?



Related Post