టి-కాంగ్రెస్ లో ఈ టికెట్స్ లొల్లి ఏమిటో?

July 17, 2018


img

సాధారణంగా ఎన్నికలలో గెలిచిన పార్టీల నేతలు చాలా బలంగా కనిపిస్తుంటారు. కానీ కాంగ్రెస్ నేతలు అందుకు పూర్తి భిన్నమని చెప్పవచ్చు. వారు ఎన్నికలలో ఓడిపోయిన తరువాత చాలా కలిసికట్టుగా, బలంగా కనిపిస్తారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వారిలో ఆ ఐక్యత, సమన్వయం కరిగిపోయి వాటి స్థానంలో ముఠా తగాదాలు, టికెట్స్, పదవుల కోసం కీచులాటలు బయటపడుతుంటాయి. ఏ పార్టీలోనైనా ఇది సర్వ సాధారణమైన విషయమే కానీ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకత్వాలను ఎవరూ ఖాతరు చేయరు కనుక ఈ ధోరణి మరికాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక టి-కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఈ అవకరాలన్నీ మెల్లగా బయటపడుతున్నాయి. 

సీనియర్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ తాను సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేయాలనుకొంటున్నానని మొన్న ఆదివారం ప్రకటించేశారు. ఆ స్థానాన్ని ఆశిస్తున్న నగర అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ ఆయనపై భగ్గుమన్నారు. దమ్ముంటే హైదరాబాద్ నుంచి పోటీ చేయమని సవాలు విసిరారు. సికింద్రాబాద్ నుంచి ఎవరు పోటీ చేసినా మద్దతు ఇస్తానని ప్రకటించి వి.హనుమంతరావు ఆ వేడిని మరింత పెంచారు. అంజన్ కుమార్ కే టికెట్ ఇవ్వాలని మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ అన్నారు. పనిలో పనిగా రేణుకా చౌదరి ఖమ్మం నుంచే పోటీ చేస్తే మంచిదని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. 

నల్గొండకు చెందిన నాయకుడే తెలంగాణాకు ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ప్రకటించేశారు. తాను నల్గొండ నుంచి లోక్ సభకు పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడో ప్రకటించుకొన్నారు. భువనగిరిలో నిన్న జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకొని కొట్టుకొన్నారు.                     

ఈవిధంగా టి-కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా టికెట్స్, తమ ప్రాధాన్యతల గురించి బహిరంగంగానే మాట్లాడుతుండటంతో నేతల మద్య కీచులాటలు క్రమంగా పెరిగిపోతున్నాయి. కానీ అందరూ సీనియర్లే కావడంతో ఎవరూ ఎవరినీ నియంత్రించలేని పరిస్థితి కనిపిస్తోంది. టి-కాంగ్రెస్ నేతలు ఇదేవిధంగా ఎన్నికలకు వెళితే తెరాస సునాయాసంగా విజయం సాధిస్తుంది. ఆ తరువాత కాంగ్రెస్ నేతలు మళ్ళీ నాలుగేళ్ళవరకు ఐకమత్యంగా కాలక్షేపం చేయవచ్చు.


Related Post