నోట్లో కరక్కాయ...ఖరీదు లక్షలే

July 17, 2018


img

కరక్కాయ ఏమిటి..లక్షల ఖరీదు చేయడం ఏమిటి అనుకోవద్దు. ఇది అక్షరాల నిజం. అలాగని అదేదో హిమాలయాల నుంచి తెచ్చిన అపురూపమైన కరక్కాయ కాదు. మామూలు కరక్కాయే. అయితే మరి లక్షల ఖరీదు ఏమిటంటారా? అయితే ఈ చేదు కరక్కాయ బాగోతం కధ గురించి తెలుసుకోవాల్సిందే.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున కొన్ని నెలల క్రితం ‘సాఫ్ట్ ఇంటిగ్రేటడ్ మల్టీ టూల్స్’ అనే ఒక సంస్థ ఏర్పాటయింది. అది కరక్కాయల పొడిని ఆయుర్వేద మందులు తయారుచేసే సంస్థలకు అమ్ముతుంటుందిట! ఎటువంటి పెట్టుబడి లేకుండా కంపెనీ ఇచ్చే రూ.100ల విలువగల కరక్కాయలను పొడిచేసి తెచ్చి ఇస్తే రూ.130 చెల్లిస్తానని చెప్పడంతో చుట్టుపక్కల మహిళలు ఆ కంపెనీ నుంచి కరక్కాయలను తీసుకొనివెళ్లి ఇంట్లో పొడిచేసి తీసుకువచ్చి డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టారు. 

ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకడంతో ఆ కంపెనీ ముందు కరక్కాయల కోసం జనాలు క్యూలో నిలబడటం మొదలుపెట్టారు. కరక్కాయలకు డిమాండ్ పెరగడంతో ఆ కంపెనీ కేజికి ఇంత అని డిపాజిట్ తీసుకోవడం మొదలుపెట్టింది. రూ.1,000లు చెల్లించి కరక్కాయలు తీసుకువెళ్ళి పొడి చేసి తీసుకువస్తే వెంటనే రూ.1,300, అదే రూ.10,000కు రూ.13,000 ఇస్తుండటంతో జనాలు కరక్కాయల కోసం ఎగబడిపోయారు. 

అంత తక్కువ సమయంలో అంత తేలికగా డబ్బు లభిస్తుండటంతో కరక్కాయల కోసం కొట్టుకొనే పరిస్థితి కూడా వచ్చింది. దాంతో జనాలు పోటీలుపడి వేలు..లక్షల రూపాయలు చెల్లించి సరుకు తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. చివరికి అది ఎంత వరకు వెళ్ళిందంటే ఒకరు ఏకంగా రూ.70 లక్షలు చెల్లించి కరక్కాయలు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరూ లక్ష రూపాయల మొదలు 10,15,20,30..70 లక్షల వరకు చెల్లించి కరక్కాయలు పట్టుకువెళ్ళారు. 


వాటిని మరమిల్లుకు తీసుకువెళ్లి ఆడించి తీసుకువస్తే చాలు...వెంటనే 30 నుంచి 50 శాతం అధనంగా డబ్బు చేతిలో పడుతుంది అనుకొన్నారే తప్ప ఆ సంస్థే స్వయంగా కరక్కాయలను మిల్లులో ఎందుకు ఆడించుకోవడంలేదు?మిల్లులో ఆడించి తెచ్చినందుకు ఎవరైనా అంత డబ్బు ఇస్తారా? అని ఎవరూ ఆలోచించినట్లు లేదు. లేదా ఆ సంస్థ సిబ్బంది జనాలకు ఏదో మాయమాటలు చెప్పి ఉండవచ్చు. ఇప్పటికే ఈ చేదు కరక్కాయ కధలో క్లైమాక్స్ అందరికీ అర్ధమయిపోయే ఉంటుంది. 

ఊహించినట్లుగానే సుమారు రూ.5 కోట్లు వసూలు అయిన తరువాత సదరు కరక్కాయ సంస్థ యజమాని, మేనేజర్లు సిబ్బంది అందరూ బోర్డు తిప్పేసి మాయం అయిపోయారు. అప్పుడు కానీ జనాలు మేల్కోలేదు. లబోదిబోమని ఏడుస్తూ కే.పి.హెచ్.బి. పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి సోమవారం ఉదయం నుంచి సదరు కంపెనీ ముందు పడిగాపులు కాస్తున్నారు. 

కొందరు తమ కష్టార్జితాన్ని అంతా దీనిలో పెట్టుబడిగా పెట్టగా, కొందరు తమ విలువైన వస్తువులను అమ్ముకొని, అప్పులు చేసి తెచ్చిమరీ పెట్టుబడి పెట్టారు. కొందరు తమ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళకు, ఇల్లు కట్టుకోవడానికి  దాచుకొన్న సొమ్మును తెచ్చి పెట్టుబడి పెట్టారు. వారి కష్టమంతా ఇప్పుడు కరక్కాయల పొడి రూపంలో వారి కళ్ళ ముందే ఉంది. బస్తాల కొద్దీ పోగుపడిన ఆ కరక్కాయ పొడిని ఏమి చేసుకోవాలో తెలియక, తమ డబ్బు ఏవిధంగా తిరిగితెచ్చుకోవాలో తెలియక వందలాదిమంది మహిళలు, మధ్యతరగతి ప్రజలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఆ కేటుగాళ్ళను పట్టుకొని తమ సొమ్ము తమకు ఇప్పించాలని ప్రాధేయపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వారికోసం గాలిస్తున్నారు. ఆ సంస్థలో పనిచేసిన కొంతమంది సిబ్బందిని పట్టుకొని ప్రశ్నిస్తున్నారు. కానీ సూత్రధారులు మాత్రం ఎప్పుడో జంప్ అయిపోయారు. కనుక కరక్కాయలు లక్షలు ఖరీదు చేస్తాయని ఇప్పుడైనా నమ్ముతారా లేదా?


Related Post