పరిపూర్ణానందస్వామిని తెలంగాణా డిజిపి మహేందర్ రెడ్డి నగరబహిష్కరణ చేసినప్పుడు హిందూ సంస్థలు, రాష్ట్ర భాజపా నేతలు గట్టిగా ఖండించారు. ఆ వ్యవహారంపై రాష్ట్ర భాజపా నిరసనలకు సిద్దమయింది. ఆయనపై బహిష్కరణ ఎత్తివేయవలసిందిగా డిమాండ్ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, రాంచందర్ రావు నేతృత్వంలో భాజపా కార్యకర్తలు ప్రగతిభవన్ వరకు ర్యాలీగా బయలుదేరడానికి సిద్దమయ్యారు. కానీ ఆ సంగతి ముందే తెలుసుకొన్న పోలీసులు వారిరువురినీ గృహనిర్బంధం చేయడంతో ర్యాలీ నిలిచిపోయింది.
హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడిపై కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా స్వామీజీ హైదరాబాద్ నుంచి యాదాద్రికి పాదయాత్ర చేయాలనుకొన్నారు. కొన్ని హిందూ సంస్థల ప్రతినిధులు కూడా ఆయనతో కలిసి పాదయాత్రకు సిద్దపడ్డాయి. కానీ కత్తి మహేష్, స్వామీజీ ఇద్దరికీ నగర బహిష్కరణలు విధించడంతో ఆ వ్యవహారం అక్కడితో సద్దుమణిగింది. కానీ ఇవాళ్ళ భాజపా ర్యాలీకి సిద్దపడటంతో అది ఈ వ్యవహరాన్ని విడిచిపెట్టలేదని స్పష్టం అయ్యింది.
కత్తి మహేష్-స్వామీజీ మద్య మొదలైన ఈ వివాదాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రంలో తమకు అనుకూలమైన రాజకీయ వాతావరణం సృష్టించుకోవాలని భాజపా ప్రయత్నించడం సహజమే. అయితే విషయంలో తెరాస సర్కార్ చాలా చురుకుగా వ్యవహరిస్తూ భాజపాకు ఆ అవకాశం లేకుండా చేస్తోంది. తెరాస-భాజపా రాజకీయాల మాట ఎలాగున్నా నగరంలో ప్రశాంత వాతావరణం చాలా అవసరం.