ఉద్యోగాలభర్తీకి కూడా ప్రతిపక్షాలనే నిందించాలా?

July 16, 2018


img

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై, అది తీసుకొంటున్న పలునిర్ణయాలపై, టి.ఎస్.పి.ఎస్.సి.జారీ చేస్తున్న నోటిఫికేషన్లపై న్యాయస్థానాలలో పిటిషన్లు దాఖలవుతున్న మాట వాస్తవం. వాటిలో కొన్ని వాస్తవమైన కారణాల చేత దాఖలైనవి కాగా మరికొన్ని రాజకీయ దురుద్దేశ్యంతో దాఖలైనవి కూడా ఉండి ఉండవచ్చు. వాటి కారణంగా తమ ప్రభుత్వం చేపడుతున్న పనులకు, తీసుకొంటున్న నిర్ణయాలకు అవరోధాలు ఏర్పాడుతున్నాయని తెరాస వాదన. కనుక ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకొంటున్నాయని వాదిస్తోంది. అదేవిధంగా ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మంత్రి కేటిఆర్ ఆరోపించారు.

సోమవారం సిరిసిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అయన ప్రతిపక్షాలు ఎన్ని అవరోధాలు సృష్టించినా 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని చెప్పారు. 

ఉద్యోగాల భర్తీ విషయంలో తెరాస సర్కార్ విఫలమైందని, అది ఉద్దేశ్యపూర్వకంగానే లోపభూయిష్టమైన నోటిఫికేషన్లు జారీ చేస్తూ న్యాయవివాదాలకు ఆస్కారం కల్పిస్తూ ఉద్యోగాలు భర్తీ చేయకుండా తప్పించుకొంటోందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, ఉద్యోగాల భర్తీకి ప్రతిపక్షాలే అడ్డుపడుతున్నాయని మంత్రి కేటిఆర్ విమర్శించడం విడ్డూరంగా ఉంది. 

ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఆర్ధికశాఖ అనుమతివ్వాలి. ఎందుకంటే ఆ ఉద్యోగాల భర్తీతో ప్రభుత్వం మీద ఆర్దికభారం పెఎరుగుతుంది. అందుకే ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చాలా నిదానంగా చేస్తుంటాయి. అయితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ మొదలు అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి నియామక పత్రాలు అందించడం ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని అందరికీ తెలుసు. సుదీర్ఘమైన సంక్లిష్టమైన ఆ ప్రక్రియలో లోపాలు దొర్లడం సహజమే. లోపాలున్నప్పుడు ఎవరైనా ప్రశ్నించడం, వాటిని సరిచేయమని కోరడం సహజమే. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్షాలను నిందిస్తూ సమస్యను వారిపైకి త్రోసివేయవచ్చు కానీ అంతిమంగా తెరాస ఐదేళ్ళ పాలనలో ఉద్యోగాలు భర్తీ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని నిరుద్యోగయువత భావిస్తారని మరిచిపోకూడదు. కనుక మంత్రి కేటిఆర్ చెప్పినట్లు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఉద్యోగాల భర్తీలో మాట నిలబెట్టుకోవడం తప్పనిసరి.


Related Post