అజారుద్దీన్ ప్రకటించేశారు

July 16, 2018


img

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ 2019ఎన్నికలలో తాను సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకొంటున్నానని ఆదివారం మీడియాకు తెలిపారు. తన అభిప్రాయం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు, పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేసానని, వారు ఏ నిర్ణయం తీసుకొన్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇస్తే తప్పకుండా విజయం సాధించగలననే నమ్మకం తనకు ఉందని అజారుద్దీన్ చెప్పారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా తాను సికింద్రాబాద్ నుంచే లోక్ సభకు పోటీ చేయాలని కోరుకొంటున్నారని చెప్పారు.

వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనవి. ఒకవేళ వాటిలో ఓడిపోతే తెదేపాలాగే కాంగ్రెస్ పార్టీకూడా రాష్ట్రంలో నుంచి మెల్లగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కనుక అది తన ఉనికిని కాపాడుకోవడం కోసమైనా వచ్చే ఎన్నికలలో గెలవడం చాలా అవసరం. కనుక వచ్చే ఎన్నికలలో పార్టీలో అంతర్గత ఒత్తిళ్లకు లొంగకుండా గెలుపు గుర్రాలకే టికెట్స్ ఇవ్వవలసి ఉంటుంది. కానీ పార్టీలో ఇప్పటికే కొంతమంది వచ్చే ఎన్నికలలో తాము ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయదలచుకొన్నామో ప్రకటించుకొంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను వచ్చే ఎన్నికలలో నల్గొండ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీలో నేతలు ఎవరికివారు ఇదేవిధంగా ప్రకటించుకొంటే ఇక కాంగ్రెస్ అధిష్టానానికి టికెట్స్ కేటాయింపుల విషయంలో తలనొప్పులు తప్పవు. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లుగా ఆరు నెలల ముందుగానే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసి ప్రకటిస్తే మంచిదేమో? 


Related Post