నవాజ్ అరెస్ట్ అయితే మోడీ స్పందించాలా?

July 14, 2018


img

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్ళడంపై కాంగ్రెస్ పార్టీ స్పందన చాలా విడ్డూరంగా ఉంది. “మోడీజీ ఆప్తమిత్రుడు నవాజ్ షరీఫ్ అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. దీనిపై మోడీ స్పందన ఏమిటో తెలుసుకోవాలనుకొంటున్నాము,” అని ట్వీట్ చేసింది. 

ప్రధాని నరేంద్రమోడీ 2015 డిసెంబర్ లో అఫ్హనిస్తాన్ పర్యటనకు వెళ్లి తిరిగి భారత్ వస్తున్నప్పుడు, అప్పుడు పాక్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ పుట్టినరోజని తెలుసుకొని మద్యలో లాహోర్ లో ఆగి అయనను కలిసి శుభాకాంక్షలు తెలిపి వచ్చారు. ఆ తరువాత నవాజ్ షరీఫ్ మనుమరాలి నిశ్చితార్దానికి కూడా హాజరయ్యారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నవాజ్ షరీఫ్ మోడీకి ఆప్తమిత్రుడు అని అంటోంది. 

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ ప్రధానులుగా పనిచేసినవారందరూ పాకిస్తాన్ తో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మోడీ కూడా అదే చేశారు. ఆ సమయంలో నవాజ్ పాక్ ప్రధానిగా ఉన్నారు. అప్పుడు ఆయనపై ఎటువంటి ఆరోపణలు లేవు. కనుక పొరుగుదేశంతో సంబంధాలు బలపరుచుకోవడానికి ప్రధాని మోడీ తన పద్దతిలో ఆవిధంగా ప్రయత్నించారు. ఆ తరువాత భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ బలపడటం అందరికీ తెలుసు. అంటే మోడీ లాహోర్ ఆకస్మిక పర్యటన వలన దేశానికి చాలా మేలు కలిగిందని స్పష్టం అవుతోంది. కానీ సైన్యం కనుసన్నలలో పనిచేసే నవాజ్ షరీఫ్ ప్రభుత్వం దాని ఒత్తిడి కారణంగా భారత్ పట్ల శత్రుత్వం ప్రదర్శించక తప్పలేదు. 

దశాబ్దాలుగా భారత్-పాక్ మద్య నెలకొన్న ఘర్షణ వాతావరణం, అశాంతిని కరిగించేందుకు ప్రధాని నరేంద్రమోడీ తన శైలిలో ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలను ఒక అవినీతిపరుడితో మిత్రత్వం కలిగి ఉన్నట్లు వక్రభాష్యాలు చెప్పడం చాలా చవకబారు రాజకీయమే. 

ఒకవేళ భవిష్యత్ లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా పాక్ ప్రధానిగా ఎవరు ఉంటే వారితో సంప్రదింపులు జరుపకుండా ఉండగలరా? సంప్రదింపులు జరిపిన తరువాత ఆ దేశప్రధాని అవినీతిపరుడని తేలితే అందుకు రాహుల్ గాంధీని నిందించవచ్చా? కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తే బాగుండేది.  


Related Post