రాష్ట్ర భాజపాలో అయోమయం తగ్గిందా పెరిగిందా?

July 14, 2018


img

తెలంగాణాలో భాజపా ఒంటరిగా పోటీ చేస్తుందని అమిత్ షా చెప్పారు. నిజానికి అంతకంటే గత్యంతరం లేదు కూడా. ఎందుకంటే, రాష్ట్రంలో ఏ పార్టీ, కూటమి కూడా దానితో పొత్తులు పెట్టుకొనే ఆలోచన కూడా చేయడం లేదు. కనుక ఒంటరి పోరాటం చేయకతప్పదు. 

ఇక రాష్ట్రంలో తెరాస సర్కార్ అమలుచేస్తున్న పలు పధకాలకు కేంద్రం కూడా నిధులు అందిస్తున్న మాట వాస్తవం. అలాగే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు కేంద్రం చాలా బారీగా నిధులు ఇస్తున్నమాట వాస్తవం. అయితే ఆ విషయం గురించి తెరాస చెప్పుకోదు భాజపా నేతలే గట్టిగా ప్రచారం చేసుకోవాలి. తెరాస సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు కేంద్రప్రభుత్వం తనవాటాగా ఒక్కో ఇంటికి రూ.1.5 ఇస్తోందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ స్వయంగా చెప్పుకున్నారు. కానీ పార్టీ నేతలు ఇదే విషయం ప్రజలకు వివరించి వారిని ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారు. విఫలం అయ్యారని చెప్పడం కంటే అలసత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవడమే సమంజసం. ఈ విషయంలో రాష్ట్ర భాజపా నేతలు అలసత్వం ప్రదరిస్తుంటే తెరాస సర్కార్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతూ, అన్ని జిల్లాలలో సమంతరంగా పలు అభివృద్ధి పనులు చేస్తూ, వాటి గురించి గట్టిగా ప్రచారం చేసుకొంటూ ప్రజలను ఆకర్షించగలుగుతోంది. కనుక పధకాల అమలు, అభివృద్ధి పనుల విషయంలో రాష్ట్ర భాజపా నేతలు తెరాసను నిందించి ప్రయోజనం లేదు.

ఇక స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ అంశంపై అమిత్ షా తన పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయనను బహిష్కరించినవారితో (తెరాస) కలవవద్దని రాష్ట్ర భాజపా నేతలు కోరగా, “ఈ కారణంగా మన విరోధులను (తెరాస) ఇంకా దూరం చేసుకొని పెద్ద విరోధులుగా మార్చుకోవడం మంచిది కాదు,” అని చెప్పారు. అంటే తెరాస సర్కార్ తో సంబంధాలు యధాతధంగా కొనసాగిస్తామని చెప్పినట్లే భావించవచ్చు. ఈవిధంగా చెపుతూ తెరాసను ఓడించడానికి రాష్ట్ర భాజపా నేతలు గట్టి ప్రయత్నాలు చేయాలని అమిత్ షా కోరడం వలన ఏమి ప్రయోజనం? తెరాసతో కేంద్రప్రభుత్వం కనబరుస్తున్న అనుబంధంతో రాష్ట్ర భాజపా నేతల చేతులు, కాళ్ళు కట్టేసినట్లవుతోంది. దీంతో వారు ఏవిధంగా ముందుకు సాగాలో తెలియని పరిస్థితిని పార్టీ అధిష్టానమే కల్పించిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూసి సాక్షాత్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పెదవి విరుస్తున్నప్పుడు వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి తెరాస, కాంగ్రెస్ పార్టీలను ఏవిధంగా ఓడించగలదు?అని ఎవరికైనా సందేహం కలుగకమానదు. కానీ భాజపా నేతలకే కలిగినట్లు లేదు. అందుకే వచ్చే ఎన్నికలలో గెలిచి తామే అధికారంలోకి వస్తామని చెప్పుకొంటున్నారు.


Related Post