ఆ ఎన్నికల కోసమే ఈ ఎన్నికల వాయిదా?

July 13, 2018


img

ప్రస్తుతం దేశమంతటా ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణా రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ వంటివి కనుక రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ ఈ ఎన్నికల కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికలలో గెలిచి తమ సత్తా చాటుకోగలిగితే ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపించుకోవచ్చునని, తద్వారా సార్వత్రిక ఎన్నికలలో గెలవడం సులువు అవుతుందని ప్రతిపక్షాలు కలలుగన్నాయి. కానీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కారణాలు అందరికీ తెలుసు. 

ఆగస్ట్ 1వ తేదీతో రాష్ట్రంలోని అన్ని పంచాయితీలు రద్దు అవుతాయి. వాటి స్థానంలో స్పెషల్ ఆఫీసర్లు వస్తారు. వారి ద్వారానే గ్రామపంచాయితీలలో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు అమలు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కనుక అది ఇప్పట్లో తేలే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. కనుక సార్వత్రిక ఎన్నికల వరకు ప్రభుత్వం నియమించే స్పెషల్ ఆఫీసర్ల కనుసన్నలలోనే పంచాయితీలు పనిచేస్తాయని స్పష్టం అవుతోంది. అంటే రాష్ట్రంలో అన్ని గ్రామాలపై ప్రభుత్వానికి పూర్తి పట్టు లభిస్తుందన్న మాట!

 ఇక ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తెరాస నేతల నేతృత్వంలో తెలంగాణా రైతు సమన్వయ సమితిలు ఏర్పాటయ్యాయి. అవి కూడా గ్రామాలలో తమ ఉనికిని చాటుకొంటున్నాయి. నవంబరులో మళ్ళీ రైతులందరికీ రెండవ విడత రైతుబంధు చెక్కులు అందిస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించింది. కనుక ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా ఈ రెండు చర్యలతో గ్రామాలలో తెరాసకు అత్యంత అనుకూలమైన రాజకీయ పరిస్థితులు ఏర్పడతాయి. బహుశః ఈ ఆలోచనతోనే తెరాస సర్కార్ రిజర్వేషన్ల విషయంలో 34 శాతం అంటూ మెలికపెట్టిందా?అని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

అన్ని వర్గాలకు కలిపి 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నప్పుడు, అది తెలిసీ బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయించి, రిజర్వేషన్లను 61 శాతానికి చేర్చడం ద్వారా తెరాస సర్కార్ న్యాయవివాదాలకు అవకాశం కల్పించి ఉద్దేశ్యపూర్వకంగా పంచాయితీ ఎన్నికలు వాయిదాపడేలా చేసిందా? అని ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తెరాస సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా చేసిందో లేక బీసిలను ప్రసన్నం చేసుకోవడానికే రిజర్వేషన్లు శాతం పెంచిందో తెలియదు కానీ పంచాయితీ ఎన్నికలు వాయిదాపడటం వలన తెరాసకు మేలు కలుగవచ్చని అర్ధమవుతోంది.


Related Post