తెరాస ఎన్నికలకు భయపడుతోందా?

July 12, 2018


img

రాష్ట్రంలో పంచాయితీల పదవీకాలం ఆగస్ట్ 1వ తేదీతో పూర్తవుతుంది. కానీ ఎన్నికలు జరుపలేని పరిస్థితి ఏర్పడింది! కారణాలు అందరికీ తెలిసినవే. 

బిసి జనాభా లెక్కలలో చాలా తేడాలున్నాయని వాటిని సరిచేసే వరకు ఎన్నికలు నిర్వహించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదీగాక జనాభా ప్రాతిపదికన బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వం నిర్ణయించడంతో అన్ని వర్గాలకు కలిపి 61 శాతం రిజర్వేషన్లయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతంకు మించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. కనుక పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

పంచాయితీ ఎన్నికలను ఎదుర్కోవడానికి తెరాస భయపడుతోంది కనుకనే ఈ వంకతో ఎన్నికలు జరుపకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందని రాష్ట్రంలో ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగబోతున్న కీలకమైన ఈ ఎన్నికలలో తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, టిజెఎస్, బిఎల్ఎఫ్ తదితర పార్టీలు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆ పార్టీలు గ్రామస్థాయిలో చాలా గట్టి సన్నాహాలే చేసుకొన్నాయి కూడా. కానీ వాటి ఆశలపై తెరాస సర్కార్ నీళ్ళు చల్లింది. ఎన్నికలు వాయిదా పడటంతో సహజంగానే ప్రతిపక్షాలు తెరాసపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలు పైచెయ్యి సాధిస్తే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందనె భయంతోనే తెరాస సర్కార్ ఎన్నికలను ఎదుర్కోకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

ప్రతిపక్షాలు ఆరోపణలకు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. ప్రతిపక్షాలే ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి భయపడి హైకోర్టులో పిటిషన్లు వేయిస్తున్నాయని ఆరోపించారు. తెరాస ఎప్పుడూ ఎన్నికలకు భయపడదని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉందని అన్నారు. విద్యా, ఉద్యోగాలలో మైనార్టీలకు, గిరిజనులకు రిజర్వేషన్ల శాతం పెంచాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, బిసిలకు రాజ్యాధికారం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన వారికి పంచాయితీ ఎన్నికలలో 34శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని చెప్పారు. ఇంతకీ ఎన్నికలు వాయిదా పడటానికి ఎవరు కారణం? ఎవరిని నిందించాలి? 


Related Post