తమిళనాడులో అమిత్ షాకు చేదు అనుభవం

July 10, 2018


img

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. వచ్చే ఎన్నికల కోసం తమ పార్టీ నేతలను సిద్దం చేయడం కోసం తమిళనాడు వెళ్ళిన ఆయనకు “గో బ్యాక్ అమిత్ షా” అంటూ తమిళ ప్రజలు ట్విట్టర్ లో మెసేజ్ లు పెడుతున్నారు. దేశ ప్రజలను మతం పేరుతో విడదీయాలని ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా వంటివారికి తమిళనాడులో చోటు లేదని మెసేజులు పోస్ట్ చేస్తున్నారు. 

వచ్చే ఎన్నికలలో గౌరవప్రదమైన సీట్లు సాధించి మెల్లగా తమిళనాడులో నిలద్రొక్కుకోవాలని భాజపా ఆలోచిస్తుంటే తమిళ ప్రజల నుంచి ఇంతగా తిరస్కారం ఎదుర్కోవలసిరావడం ఆశ్చర్యమే. అందుకు అనేక కారణాలున్నాయి. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ అన్నాడిఎంకె సభ్యులు పార్లమెంటులో ఆందోళనలు చేసినా కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. తమిళ జాలారులను శ్రీలంక నావికాదళం తరచూ అరెస్ట్ చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా జయలలిత మరణం తరువాత తమిళనాడులో భాజపా పాగా వేయడానికి మోడీ, అమిత్ షాలు అన్నాడిఎంకెను అడ్డుపెట్టుకొని తెర వెనుక నుంచి కధ నడిపిస్తున్నారనే ఆగ్రహం చాలా ఉంది. కొన్ని నెలల క్రితం చెన్నైలోని ఆర్.కె.నగర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలలో భాజపాకు ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు పడటం గమనిస్తే భాజపా పట్ల తమిలప్రజల ఆగ్రహం ఏ స్థాయిలో అర్ధం చేసుకోవచ్చు. కనుక తమిళనాడు పట్ల భాజపా వైఖరిలో స్పష్టమైన మార్పు కనబడేవరకు ఆ రాష్ట్రంలో ఒక్క సీటు గెలుచుకోవడం కూడా కష్టమేనని చెప్పవచ్చు. తమిళనాడు తరువాత అమిత్ షా తెలంగాణా రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. జూలై 13వ తేదీన అయన హైదరాబాద్ రాబోతున్నారు. మరి తెలంగాణా ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 


Related Post