పంచాయతీ ఎన్నికలపై కెసిఆర్ తాజా నిర్ణయం

July 10, 2018


img

పంచాయతీ ఎన్నికలలో 50 శాతం కంటే మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. దీనిపై మరింతలోతుగా చర్చించేందుకు బుధవారం ఉదయం ప్రగతిభవన్ లో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై న్యాయపరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో పాటు న్యాయశాఖకు చెందిన నిపుణులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించవలసిందిగా సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. 

రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బిసిలకు పంచాయతీ ఎన్నికలలో 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం చాలా అవసరమని సిఎం కెసిఆర్ అభిప్రాయపడుతున్నారు. కనుక ఎస్సీ, ఎస్టీ, బీసిలకు కలిపి 50 శాతంలోపు రిజర్వేషన్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాని పని అని సిఎం కెసిఆర్ భావిస్తున్నారు. కనుక దీనిపై సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని భావిస్తున్నారు.

ఈ అంశంపై సుప్రీంకోర్టులో జరుగబోయే విచారణ, ఇదివరకు రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంపుపై చర్చకు దారితీయవచ్చు. ఒకవేళ పంచాయితీ ఎన్నికలలో 50 శాంతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు కేటాయించడానికి సుప్రీంకోర్టు అంగీకరించినట్లయితే, అది ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుకు మార్గం సుగమం కావచ్చు. 

ఒకవేళ సుప్రీంకోర్టు ఈ విషయంలో తెరాస సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పు చెప్పినప్పటికీ, దళితులు, బిసిలు, ముస్లింల కోసం పోరాడిన పార్టీగా చెప్పుకొని తెరాస రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేయవచ్చు. అంటే రిజర్వేషన్ల విషయంలో ఓడినా గెలిచినా తెరాసకు రాజకీయ లబ్ది కలగడం తధ్యమన్న మాట. ఇక ఈ న్యాయపోరాటాలతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి కనుక పంచాయితీ ఎన్నికలు ఎప్పటికైనా జరుగుతాయో లేదో చూడాలి.


Related Post