త్రిశంకు స్వర్గంలో డిఎస్

July 10, 2018


img

తెరాసలో డి.శ్రీనివాస్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుంది. కాంగ్రెస్ విడిచిపెట్టి తెరాసలో చేరిన తరువాత రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కానీ తెరాసలో ఆయనను పట్టించుకునే నాధుడే లేడు. నిజామాబాద్ లో అయనకు మంచి పట్టుంది. కానీ తెరాస నేతలు ఎవరూ ఆయనను పలకరించరు. పైగా వారందరూ కలిసి ఆయనపై సిఎం కెసిఆర్ కు పిర్యాదు చేశారు. సిఎం కెసిఆర్ ను కలిసి తన గోడు వెళ్ళబోసుకొందామనుకుంటే అయన అపాయింట్ మెంట్ ఇవ్వరు. అలాగని జిల్లా నేతలు కోరినట్లుగా అయనను పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఈ పరిస్థితులలో ఇంకా పార్టీలో ఉండాలో బయటకు పోవాలో తెలియని స్థితిలో శ్రీనివాస్ ఉన్నారు. 

కనుక తన భవిష్య కార్యాచరణ నిర్ణయించుకునేందుకు అయన సోమవారం కొంపల్లిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి జిల్లాకు చెందిన కొందరు ఎంపిటీసిలు, జెడ్.పి.టి.సిలు, ఎంపిపిలు, సర్పంచ్, మాజీ సర్పంచ్ లు హాజరయ్యారు. 

తెరాసలో సముచిత గౌరవం లభించనప్పుడు ఇంకా పార్టీలో కొనసాగడం అనవసరమని, తక్షణమే పార్టీని విడిచిపెట్టడం మంచిదని కొందరు అభిప్రాయపడగా, తమపై ఎంపి కవిత స్వయంగా ముఖ్యమంత్రికి పిర్యాదు చేసినప్పటికీ ఆయన ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదని కనుక పార్టీ వీడటం తొందరపాటు అవుతుందని మరికొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. తక్షణమే ఏ నిర్ణయమూ తీసుకోకూడదని మరికొంత కాలం వేచి చూద్దామని వారందరూ నిర్ణయించుకొని సమావేశం ముగించారు. 

పార్టీలో కొనసాగడంపై డి.శ్రీనివాస్ అనుచరుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయంటే దానర్ధం ఒకవేళ అయన తెరాసను వీడాలనుకుంటే తెరాసలోనే కొనసాగాలని సూచిస్తున్నవారు ఆయన వెంట బయటకు రాకపోవచ్చునని భావించవచ్చు. అదే జరిగితే డి.శ్రీనివాస్ రాజకీయంగా బలహీనపడతారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయనకు ప్రాధాన్యత లభించకపోవచ్చు. బహుశః అందుకే పార్టీ మారే ఆలోచనను వాయిదా వేసుకున్నారేమో? సిఎం కెసిఆర్ అయన విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోకుండా శిక్షిస్తునట్లుంది.


Related Post