ఆ అనుమానాలు తీరాయిట!

July 09, 2018


img

‘జనచైతన్యయాత్ర’ ముగింపు సందర్భంగా భాజపా సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి చెప్పిన మాటలు విన్నప్పుడు తమ పార్టీ గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకొంటున్నారో భాజపా నేతలు గ్రహించారని స్పష్టం అవుతోంది. 

హైదరాబాద్ ఆర్టీసి కళ్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఇప్పటి వరకు తెరాస-భాజపాల మద్య రహస్య అవగాహన ఉందని, వచ్చే ఎన్నికలలో రెండు పార్టీలు పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేస్తాయని ప్రజలలో అపోహలు నెలకొని ఉండేది. కానీ మేము చేపట్టిన ఈ జనచైతన్యయాత్ర ఆ అపోహలు, అనుమానాలు అన్నీ పటాపంచలు అయ్యాయి. ఈ యాత్రతో మా పార్టీ కార్యకర్తలకు కూడా పూర్తి స్పష్టత వచ్చింది. కనుక ఇక అందరూ కలిసి కట్టుగా తెరాసతో పోరాడేందుకు సిద్దం చేయగలిగాము,” అని ఇంద్రసేనారెడ్డి అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, కేంద్ర ఉన్నతాధికారులకు తెరాస సర్కార్ కు మద్య చక్కటి సంబంధాలు కలిగి ఉండటం, తెరాస సర్కార్ కూడా అవసరమైనప్పుడు కేంద్రం సహాయం తీసుకొంటూ, మద్దతు ఇస్తుండటంతో భాజపా-తెరాసల మద్య మంచి అవగాహన ఉందని ప్రజలు కూడా భావిస్తున్నారు. జమిలి ఎన్నికల విషయంలో కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించడాన్ని అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ఈవిధంగా పలుఅంశాలలో కేంద్రానికి తెరాస గట్టిగా మద్దతు ఇస్తుండటం వలన తెరాసకు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందీ లేదు కానీ అదే..రాష్ట్ర భాజపా పట్ల ప్రజలలో అనుమానాలు రేకెత్తిస్తోంది. కేంద్రానికి అండగా నిలబడటం ద్వారా రాష్ట్రంలో భాజపాను రాజకీయంగా బలహీనపరచగలగడం గొప్ప విషయమేనని చెప్పవచ్చు.    

కానీ తెరాస సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ తాము జనచైతన్యయాత్ర పూర్తిచేసినందున తెరాస-భాజపాల మద్య ఎటువంటి రహస్య అవగాహన లేదని, అవి రాజకీయంగా శత్రువులేనని ప్రజలు నమ్ముతారని రాష్ట్ర భాజపా నేతలు అనుకుంటే ఎవరు మాత్రం కాదంటారు?


Related Post