ఆ కూలీకి..ఈ కూలీకి ఎంత తేడా

July 09, 2018


img

కూలిపని అంటే కడుపు నింపుకోవడం కోసం కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడం కోసమేనని అందరికీ తెలుసు. కానీ అందుకు భిన్నమైనది గులాబీకూలి. తెరాస ప్లీనరీ సమావేశాల నిర్వహణ కోసం నిధులు సమీకరించడానికి చేసేది అది. దానిపై ఎన్ని విమర్శలు వచ్చాయో అందరికీ తెలుసు. 

ఈ రెండు రకాల కూలీకి పూర్తిభిన్నమైనది జెమినీ టీవిలో మంచు లక్ష్మి చేస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం కోసం ప్రముఖులు చేసే కూలి. 

రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణాలో నిసహ్హాయులకు సహాయపడేందుకు మంచు లక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉదాత్తమైన ఆ కార్యక్రమానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన అనేకమంది హాజరయ్యి యధాశక్తిన ఆపన్నులకు సహాయపడుతున్నారు. వారికోసం బారీగా విరాళాలు ఇవ్వడమే కాకుండా వారికోసం నిధులు సమీకరించేందుకు జ్యూస్ సెంటర్లు, కూరగాయలు, క్రీడాపరికరాలు మొదలైన దుఖాణాలలో ఆయా వస్తువులను, ఆహార ఉత్పత్తులను ప్రజలకు, తమ అభిమానులకు అమ్మి, ఆ సొమ్మును ‘మేము సైతం’ లో పాల్గొంటున్న నిసహ్హాయులకు అందజేస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రసారం అయిన ఈ కార్యక్రమంలో మాజీ కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి పాల్గొన్నారు. 

ఆ కార్యక్రమంలో ఆర్ధికసమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న నలుగురు రైతుల భార్యాపిల్లలు పాల్గొన్నారు. రాజకీయాలలో ఎంతో మొరటు మనిషిగా పేరు పడిన రేణుకా చౌదరి ఆ రైతు కుటుంబాల కష్టాలను చూసి కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఇక నుంచి తాను కూడా రాజకీయాలకు అతీతంగా రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని రేణుకా చౌదరి అందరి సమక్షంలో ప్రకటించారు. అవసరమైతే డిల్లీలో సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. 

ఆ నలుగురు రైతుల పిల్లలందరూ ఎంతవరకు చదువుకొంటే అంతవరకు తాను చదివిస్తానని వారి చదువులకయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని రేణుకా చౌదరి అందరి సమక్షంలో ప్రకటించారు. అప్పటికప్పుడు ఆ నాలుగు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు. దానిని బ్యాంకులో వారి పేరిట ఫిక్స్ డిపాజిట్ చేయిస్తానని చెప్పారు.

అంతేకాదు...మేము సైతం కార్యక్రమంలో భాగంగా రేణుకా చౌదరి స్వయంగా బయటకూర్చొని “కూరగాయలమ్మా కూరగాయలు...” అని అరుస్తూ వాటిని అమ్మి సుమారు రెండు లక్షల రూపాయల వరకు పోగుచేశారు. మిగిలిపోయిన కూరగాయలు అన్నిటినీ రేణుకా చౌదరే లక్ష రూపాయలు చెల్లించి కొనుగోలు చేసి ఆ కూరగాయలను మళ్ళీ ఆ రైతుల పిల్లలకే పంచిపెట్టేశారు. 

ఆమె కూరగాయలు అమ్ముతున్నారని తెలిసి ఆమె అభిమానులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ఆమె మనుమరాలు, చుట్టుపక్కల ప్రజలు పోటీలుపడి కేవలం రూ.50 ఖరీదు చేసే కూరగాయల ప్యాకెట్లను రూ.1000-10,000 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. రూ.1,000 చెల్లించి తనతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడేవారు ముందుకు రావలసిందిగా ఆమె కోరగా అనేకమంది ఆ డబ్బు చెల్లించి ఆమెతో సెల్ఫీలు దిగారు. 

ఆమె ఇచ్చిన లక్ష రూపాయలతో కలిపి మొత్తం మూడు లక్షలను ఒక్కో కుటుంబానికి రూ.75,000 చొప్పున పంచిపెట్టారు. ‘మేము సైతం’ కార్యక్రమంలో రేణుకా చౌదరి వంటి ప్రముఖులు చేసే ఇటువంటి గొప్ప ఉదాత్తమైన కార్యక్రమం కోసం చేస్తున్న ‘కూలి’ని చూస్తున్నప్పుడు, ఎవరికైనా తెరాస నేతలు తమ పార్టీ కార్యక్రమం కోసం చేపట్టే గులాబీకూలీ గుర్తుకు రాకమానదు. రెంటికీ మద్య ఎంత వ్యత్యాసం ఉందోననిపించకమానదు.


Related Post