జమిలి ఎన్నికలకు తెరాస యస్..తెదేపా నో

July 09, 2018


img

లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిపి నిర్వహించాలా వద్దా? కలిపి నిర్వహించడానికి ఏ పార్టీలు అనుకూలం, ఏవి వ్యతిరేకమో తెలుసుకునేందుకు కేంద్ర న్యాయ కమీషన్ చైర్మన్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ వివిధ పార్టీల అభిప్రాయాలను కోరింది. డిల్లీలో శని, ఆదివారం రెండు రోజులపాటు జరిగిన ఈ అభిప్రాయసేకరణ కార్యక్రమానికి తెరాస తరపున హాజరైన ఎంపి వినోద్ కుమార్ జమిలి ఎన్నికలకు తాము మద్దతు తెలుపుతున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన లేఖను కమిటీకి సమర్పించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “జమిలి ఎన్నికలు అంటే ముందస్తు ఎన్నికలని కొన్ని పార్టీలు, మీడియా చేస్తున్న వాదన సరికాదు. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా నిర్వహించడమే జమిలి ఎన్నికలు. రెండు తెలుగు రాష్ట్రాలలో 2019లో జమిలి ఎన్నికలే జరుగుతాయి. మిగిలిన రాష్ట్రాలలో కూడా జమిలి ఎన్నికలు నిర్వహించినట్లయితే అనవసరపు ఖర్చులు, ప్రభుత్వ యంత్రాంగంపై భారం అన్నీ తగ్గుతాయనే ఉద్దేశ్యంతోనే మేము ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు ఇస్తున్నాము,” అని అన్నారు. 

ప్రధానపార్టీలైన కాంగ్రెస్, భాజపాలు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు మరికొంత సమయం కావాలని కోరాయి. అకాలీ దళ్, అన్నాడీఎంకె, బిజెడి, సమాజ్ వాదీ పార్టీలు జమిలి ఎన్నికలను సమర్ధించాయి. తెదేపా, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, ఆమాద్మీ, జెడిఎస్, మరో రెండు పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు తేల్చిచెప్పాయి. జమిలి ఎన్నికల పేరుతో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం కుట్ర పన్నుతోందని వాదించాయి. అసలు ఎన్నికల నిర్వహణ అంశం న్యాయశాఖ పరిధిలో లేనప్పుడు దానిపై ఆ శాఖ కమీషన్ ఏవిధంగా అభిప్రాయ సేకరణ చేపట్టిందని అవి ప్రశ్నించాయి.


Related Post