కేటిఆర్ ప్రశ్నకు కాంగ్రెస్ జవాబు చెప్పగలదా?

July 07, 2018


img

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షలు పంటరుణాలు మాఫీ చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇస్తున్నారు. అయితే అది ఏవిధంగా సాధ్యమో చెప్పడం లేదు. కనీసం టి-కాంగ్రెస్ లో ఒకరిద్దరు నేతలు తప్ప మిగిలినవారెవరూ ఈ హామీ గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఇక కాంగ్రెస్ అధిష్టానం ఈ హామీపై ఇంతవరకు నిర్దిష్టమైన ప్రకటన చేయలేదు. కానీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తరచూ ఒకేసారి రూ.2 లక్షలు పంటరుణాలు మాఫీ చేస్తామని చెపుతూనే ఉన్నారు. ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం విఫలమైందని వాదిస్తున్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్న ఈ హామీపై మంత్రి కేటిఆర్ ట్విట్టర్ లో స్పందించారు. “డియర్ రాహుల్ గాంధీజీ, తెలంగాణాలో పంటరుణాల మాఫీకి ఇక్కడ మా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్నే అక్కడ కర్ణాటకలో మీ సంకీర్ణ ప్రభుత్వం అనుసరిస్తూ నాలుగు విడతలలో రుణాలు మాఫీ చేస్తోంది. కానీ ఇక్కడ తెలంగాణాలో మీ పార్టీ నేతలు ఒకేసారి మాఫీ చేస్తామని చెపుతున్నారు. ఇక్కడ అమలు చేయగలమని మీ పార్టీ నేతలు చెపుతున్నప్పుడు అక్కడ కర్ణాటకలో మీ ప్రభుత్వం ఎందుకు అమలుచేయలేకపోతోంది?” అని ప్రశ్నించారు. 

కర్ణాటకలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కుమారస్వామి చేతిలో ప్రభుత్వం ఉంది. కనుక కాంగ్రెస్ విధానాలను అమలు చేయించడం కొంచెం కష్టమే. కానీ ఇదివరకు కర్ణాటకను ఐదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీయే పాలించింది. కనుక అప్పుడు ఒకేసారి పంటరుణాలు మాఫీ చేసి చూపి ఉంటే, తెలంగాణాలో కాంగ్రెస్ నేతల వాదనకు బలం చేకూరేది. ప్రజలు కూడా నమ్మి ఉండేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఒకేసారి పంట రుణాలను మాఫీ చేయలేనప్పుడు తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇస్తున్న హామీ నమ్మశక్యంగా లేదు. బహుశః అందుకే టి-కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈ హామీని గట్టిగా సమర్ధించడం లేదేమో? స్వంత పార్టీ నేతలకే నమ్మకం లేనప్పుడు ఇక ప్రజలు మాత్రం ఎందుకు నమ్ముతారు? కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అధిష్టానం చేత దీనిపై అధికారిక ప్రకటన చేయించగలిగితే బాగుంటుంది.


Related Post