రాజకీయాలలో సంస్కారం అవసరం..మగతనం కాదు: తెరాస

July 07, 2018


img

తెలంగాణా భాజపా చేపట్టిన జనచైతన్యయాత్రలలో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి రామ్ మాధవ్ తెరాస ఎమ్మెల్యేలకు మగతనంలేదని విమర్శించారు. దానిపై తెరాస ఆర్మూర్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి స్పందిస్తూ, “రాజకీయాలలో సంస్కారం అవసరం..మగతనం కాదు. రాష్ట్రంలో భాజపా నిర్వహిస్తున్న జనచైతన్యయాత్రలకు జనాలు రాకపోవడంతో రామ్ మాధవ్ అసహనానికి గురైనట్లున్నారు. అందుకే ఏమి మాట్లాడుతున్నారో తెలియకుండానే ఏదో మాట్లాడేస్తున్నారు. భాజపా ఎప్పుడూ సంస్కృతీ, సంస్కారం గురించి మాట్లాడుతుంటుంది. ఇదేనా దాని సంస్కారం?ఇదేనా దాని సంస్కృతి? గల్లీ నుంచి డిల్లీ వరకు కోట్లాడి తెలంగాణా సాధించుకొని తెరాస తన మగతనాన్ని ఎప్పుడో నిరూపించుకొంది. 2014 ఎన్నికల మొదలు నేటి వరకు రాష్ట్రంలో జరిగిన ప్రతీ ఎన్నికలలో విజయం సాధిస్తూ తెరాస తన మగతనాన్ని నిరూపించుకొంటూనే ఉంది. కనుక రామ్ మాధవ్ తెరాస ఎమ్మెల్యేలను ఉద్దేశ్యించి చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలి,” అని డిమాండ్ చేశారు. 

‘రాజకీయాలలో మగతనం’ అనే అంశంపై తెరాస, భాజపాల ఈ కొట్లాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. వాటి కొట్లాటలతో ప్రజలకు వినోదం పంచుతున్నాయి. 

సిఎం కెసిఆర్-ప్రధాని నరేంద్రమోడీల మద్య, అలాగే...కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబంధాలే ఉన్న సంగతి అందరికీ తెలుసు. బహుశః ఆ కారణం చేతనే ఇప్పటివరకు తెరాసపై రాష్ట్ర భాజపా నేతలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తెరాస వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఒక అసందర్భమైన అంశంపై భాజపాపై విరుచుకుపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక యుద్ధం ప్రారంభించింది అనుకోవాలా?


Related Post