కోమటిరెడ్డి దూకుడు మరీ ఎక్కువయిందా?

July 07, 2018


img

రాజకీయాలలో దూకుడు, ఆత్మవిశ్వాసం చాలా అవసరమే కానీ మితిమీరితే ఎదురుదెబ్బలు తప్పవు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాల రద్దు విషయంలో తెరాస తొందరపడి ఎదురుదెబ్బలు తినడం అందరూ చూశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ ‘సెల్ఫ్ గోల్’ చేసుకోబోతున్నారని చెప్పకతప్పదు. నిజామాబాద్ తెరాస ఎంపి కవితకు ఆమె నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎంత ప్రజాధారణ ఉందో అందరికీ తెలుసు. కనుక ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసినా చాలా సులువుగా విజయం సాధించగలరని చెప్పవచ్చు. మరి ఆమె తన స్వంత నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలవలేరా? అంటే గెలవలేరని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాదిస్తున్నారు.

వచ్చే ఎన్నికలలో ఆమె తన స్వంత నియోజకవర్గంలో గెలిచినట్లయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమెకు నిన్న సవాలు విసిరారు. ఆయన నిజంగా తన మాటకు కట్టుబడి ఉండదలిస్తే వచ్చే ఎన్నికల తరువాత రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే, నల్గొండలో అయన గెలవడం ఎంత ఖాయమో నిజామాబాద్ లో కవిత గెలవడం అంతే ఖాయమని అందరికీ తెలుసు. అపార రాజకీయ అనుభవజ్ఞుడైన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈవిషయం తెలియదనుకోలేము. తెలిసీ ఆమెకు ఇటువంటి సవాలు విసిరారంటే ఏమనుకోవాలి? నిజామాబాద్ జిల్లాలో డి.శ్రీనివాస్ కారణంగా తెరాస నేతల మధ్య నెలకొన్న విభేదాలను దృష్టిలో ఉంచుకొని కోమటిరెడ్డి ఈవిధంగా అని ఉండవచ్చు కానీ అది రాజకీయ ఆత్మహత్యతో సమానమే.


Related Post