ఏపిలో 3 లక్షల ఇళ్ళకు గృహాప్రవేశం

July 05, 2018


img

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఉదయం ఒకేసారి 3 లక్షల ఇళ్ళలో గృహాప్రవేశాలు జరిగాయి. ఒకేసారి అన్ని గృహాప్రవేశాలు జరుగడం ఒక విశేషం అనుకుంటే, అవన్నీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పేదల కోసం నిర్మించిన ఇళ్ళు కావడం మరో విశేషం. 

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో లాంఛనంగా వాటి గృహాప్రవేశ కార్యక్రమం నిర్వహించగా, జిల్లాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఒకేసారి 3 లక్షల లబ్దిదారులు గురువారం ఉదయం గృహాప్రవేశాలు చేశారు. 

ఈ ఇళ్ళ నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేయడం వాస్తవమే. కానీ కేంద్రం వాటికి పూర్తి సొమ్ము ఇవ్వదు. 300 చ.అ.ల విస్తీర్ణం ఉన్న ఒక్కో ఇంటి ధర రూ.5.14 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా ఒక్కో ఇంటికి చెరో రూ.1.50 లక్షలు భరిస్తాయి. మిగిలిన రూ.2.14 లక్షలు లబ్దిదారులకు బ్యాంకు నుంచి రుణాల ద్వారా సమకూర్చబడుతుంది. దేశవ్యాప్తంగా వివిధరాష్ట్రాలలో ఇంచుమించుగా ఇదేవిధానంలో పేదలకు ఇళ్ళు నిర్మితమవుతున్నాయి. ఇదంతా చదివిన తరువాత ఇప్పుడు ఎవరికైనా ఒక సందేహం కలుగకమానదు. ఇది నిజంగా నిజమేనా లేక ఏపి సర్కార్ అల్లుతున్న కట్టుకధా అని?

ఏపి సర్కార్ ఏ పనిచేపట్టినా, పూర్తిచేసినా వాటిలో తప్పులు వెతికిపట్టుకొని తీవ్రవిమర్శలు చేస్తుంటారు వైకాపా నేతలు. వైకాపా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, “రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ళు కట్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కేవలం 3 లక్షల ఇళ్ళు కట్టించి గృహాప్రవేశాలు జరిపించి అదేదో ఘనకార్యం అన్నట్లు భావిస్తున్నారు,” అని విమర్శించారు. అంటే ఏపి ప్రభుత్వం 3 లక్షల ఇళ్ళు కట్టించి ఈరోజు గృహాప్రవేశాలు జరిపించడం నూటికి నూరు శాతం నిజమని దృవీకరించినట్లే భావించవచ్చు.


కనుక ఇప్పుడు మరో సందేహం కలుగకమానదు. 

రాష్ట్రవిభజన జరిగినప్పటి నుంచి తీవ్ర ఆర్ధికసమస్యలతో కొట్టుమిట్టాడుతూ, అన్ని విధాల తీవ్రవ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొంటూ, దాదాపు నిసహ్హాయస్థితిలో ఉన్న ఏపి ప్రభుత్వం నాలుగేళ్ళలో 5 లక్షల ఇళ్ళు నిర్మించగలిగినప్పుడు మనది ధనికరాష్ట్రమని పదేపదే చెప్పుకొనే తెలంగాణా ప్రభుత్వం, అత్యంత అనుకూలమైన పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ నాలుగేళ్ళలో కనీసం లక్ష డబుల్ రూమ్ ఇళ్ళనైనా ఎందుకు నిర్మించలేకపోయింది? అనే ప్రశ్నకు రాష్ట్రప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.


Related Post