త్వరలో తెలంగాణాలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర

July 05, 2018


img

వచ్చే ఎన్నికలలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. అందుకోసం తెలంగాణాలో కూడా పార్టీ నిర్మాణం చేసుకొంటున్నారు. ప్రస్తుతం ఏపిలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ తరువాత తెలంగాణాలో కూడా పర్యటించడానికి ఆ పార్టీ తెలంగాణాశాఖ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజా సమాచారం. 

పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద సంఖ్యలో అభిమానులున్న మాట వాస్తవం. అయితే వారి సహాయంతో కాంగ్రెస్, తెరాస, తెదేపా, వైకాపా, భాజపా వంటి బలమైన పార్టీలను డ్డీకొని ఓడించగలనని అనుకొంటే అత్యాసే అవుతుంది. ఏపిలో అభిమానులు జనసేనకు సంపూర్ణ సహకారం అందించవచ్చు కానీ కాంగ్రెస్, తెరాసల ప్రభావం అధికంగా ఉన్న తెలంగాణాలో పవన్ కళ్యాణ్ అభిమానుల అభిమానం సినిమాల వరకే పరిమితం కావచ్చు. తెలంగాణాలో పుట్టి పెరిగిన తెదేపా వంటి బలమైన పార్టీనే ఆంధ్రా పార్టీగా ముద్రవేసినప్పుడు, జనసేనకు తెలంగాణాలో ఆధరణ లభిస్తుందని ఆశించలేము. అయినా కాంగ్రెస్, తెరాసలను కాదని జనసేనకు ఎందుకు ఓటు వేయాలో..వేస్తే వాటికి భిన్నంగా ఏమి చేస్తుందో ప్రజలకు చెప్పి ఒప్పించడం సాధ్యమేనా? అంటే సమాధానం అందరికీ తెలుసు. 

జనసేన-సిపిఐ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి కనుక పవన్ కళ్యాణ్ తెలంగాణాలో పర్యటిస్తే సిపిఐ పార్టీకి పట్టున్న ప్రాంతాలలో ఆ పార్టీకి ఏమైనా లాభం కలుగవచ్చేమో కానీ జనసేనకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. కనుక పవన్ కళ్యాణ్ తెలంగాణాలో పాదయాత్రలు చేయడం వలన కాళ్ళనొప్పులు తప్ప మరేమీ లభించదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక ఈ శ్రమేదో ఏపిలోనే తనకు బాగా పట్టుందని భావిస్తున్న నియోజకవర్గాలలో పెడితే ఏమైనా ప్రయోజనం లభించవచ్చు. 


Related Post