10 మంది మృతి...అన్నీ షరా మామూలే!

July 04, 2018


img

మనదేశంలో ఏదైనా ఘోరదుర్ఘటన జరిగినప్పుడు మంత్రులు, అధికారులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఆ తరువాత విచారణ కమిటీ వేయడం, భాధితులకు నష్టపరిహారం ప్రకటించడంతో ఆ తంతు పూర్తయిపోయిపోతుంది. మళ్ళీ దుర్ఘటన జరిగినప్పుడు మళ్ళీ అన్నీ షరా మామూలే! గత చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొన్న దాఖలాలు అరుదు. కనుక మళ్ళీ మళ్ళీ అవే దుర్ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. 

వరంగల్ నగరంలో కోటి లింగాలవద్ద గల భద్రకాళి ఫైర్ వర్క్స్ లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. మరో 8మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “భద్రకాళి ఫైర్ వర్క్స్ కు బాణాసంచా తయారుచేసేందుకు 2017 వరకు మాత్రమే అనుమతి ఉంది. కానీ ఆ సంస్థ అనుమతి తీసుకోకుండా బాణసంచా తయారుచేస్తోంది. అనుమతి లేకుండా ప్రేలుడు పదార్ధాలు నిలువచేయడం, వాటితో బాణసంచా తయారుచేయడం, వాటిని విక్రయించడం క్రిమినల్ చర్య. కనుక ఈ ఘటనపై విచారణ జరిపించి ఆ సంస్థ యజమానిపై చట్టప్రకారం చర్యలు తీసుకొంటాము,” అని చెప్పారు. 

ఆ సంస్థ ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా ప్రేలుడు పదార్ధాలు నిలువచేసి, బాణాసంచా తయారుచేసి అమ్ముతున్నప్పుడు, ఇప్పటి వరకు అగ్నిమాపకశాఖ  ఆ సంస్థను ఎందుకు మూయించలేదు?ఆ సంస్థ ఎటువంటి అనుమతులు లేకుండా అంత భారీ స్థాయిలో ప్రేలుడు పదార్ధాలను కొనుగోలు చేసి, వాటితో బాణసంచా తయారుచేసి తెలంగాణా అంతటా ఏవిధంగా అమ్మకాలు జరుపగలిగింది? అని ఆలోచిస్తే లోపం ఎక్కడుందో అర్ధమవుతుంది. 

అధికారుల అవినీతి, అలసత్వం వలననే ఆ సంస్థ ఎటువంటి అనుమతులు లేకపోయినా ఇంతకాలం నడిచిందని, వ్యాపారం చేయగలిగిందని అర్ధమవుతోంది. వారి అలసత్వం కారణంగానే నేడు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘటన ఏవిధంగా జరిగిందని విచారణ జరిపే బదులు, ఆ సంస్థ అనుమతి లేకుండా ఇంతకాలం నడవడానికి ఎవరెవరు కారణం? అని విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకొంటే మళ్ళీ ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరుగకుండా నివారించవచ్చు. కానీ ప్రభుత్వం రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించేసింది కనుక ఈ లోపాలన్నీ కప్పబడిపోతాయి. కనుక భవిష్యత్ లో మళ్ళీ ఇటువంటి విషాదకర ఘటనలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. 


Related Post