లక్ష్మణ్ వ్యాఖ్యలు సరైనవేనా?

July 04, 2018


img

తెలంగాణా భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా కేంద్రప్రభుత్వం నిధులతో రాష్ట్రంలో చేపట్టిన పనులను తనవిగా చెప్పుకొంటున్నారు. పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యంపై కేంద్రప్రభుత్వం వాటాగా కేజీకి రూ.29 అందిస్తోంది. అలాగే తెరాస సర్కార్ గొప్పగా చెప్పుకొంటున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు, కెసిఆర్ కిట్స్ లో ఒక్కో కిట్ కోసం రూ.6,000 చొప్పున కేంద్రమే నిధులు అందిస్తోంది. అదేవిధంగా ప్రతీ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డయాలసిస్ కేంద్రాలకు కూడా కేంద్రప్రభుత్వం నిధులు అందిస్తోంది. ఇలాగ...రాష్ట్రంలో అమలవుతున్న అనేక పధకాలలో కేంద్రప్రభుత్వ వాటా ఉంది. కానీ సిఎం కెసిఆర్ అవన్నీ తన ప్రభుత్వ ఖజానా నుంచే తీసి ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్నారు,” అని అన్నారు. 

రాష్ట్ర భాజపా చేపట్టిన జనచైతన్యయాత్రలో భాగంగా మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఏర్పాటుచేసిన బహిరంగసభలలో కె.లక్ష్మణ్ ఈ ఆరోపణలు చేశారు. కానీ ఆ ఆరోపణలు సమర్ధించవచ్చా? అంటే సిఎం కెసిఆర్ ఇదివరకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం-పంపకాల గురించి ఏమి చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోకతప్పదు. 

“రాష్ట్రం నుంచి వివిధపన్నుల రూపేణా వెళుతున్న సొమ్ములో కనీసం 50 శాతం అయినా తిరిగి ఇవ్వడం లేదు. దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణా వంటి నాలుగైదు ధనిక రాష్ట్రాలే మిగిలిన అన్ని రాష్ట్రాలను పోషిస్తున్నాయి. దానిని నేను తప్పు పట్టడంలేదు కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వాటా కంటే చాలా తక్కువ వస్తున్నాయి,” అని అన్నారు.

అంటే రాష్ట్రాల నుంచి కేంద్ర ఖజానాలో జమా అవుతున్న నిధులతోనే కేంద్రప్రభుత్వం రాష్ట్రాలలో తన పధకాలను అమలుచేస్తోందని స్పష్టం అవుతోంది. అలాగే తెలంగాణావంటి ధనిక రాష్ట్రాలు అందిస్తున్న ఆదాయంతోనే ఇతరరాష్ట్రాలలో కూడా కేంద్రప్రభుత్వ పధకాలు అమలవుతున్నాయని స్పష్టం అవుతోంది. రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయంతోనే రాష్ట్రాలలో కేంద్రప్రభుత్వ పధకాలు అమలుచేస్తోందంటే ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు చేసుకొంటున్నట్లు? కేంద్రమా...రాష్ట్రాలా? ఇటువంటి మాటలు, ధోరణి ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తాయి కనుక ఇటువంటి వాదనలు చేయకుండా ఉంటేనే మంచిది.


Related Post