అక్కడ మోడీ..ఇక్కడ కెసిఆర్ సేమ్ టు సేమ్?

July 04, 2018


img

ఒక్కోసారి రాజకీయాలలో కొన్ని విచిత్రమైన పరిణామాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ ఎటువంటి రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారో, ఇక్కడ తెలంగాణాలో సిఎం కెసిఆర్ కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

అక్కడ ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించడానికి కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ సిఎం కెసిఆర్ ను గద్దె దించడనికి సిపిఎం నేతృత్వంలో 28 పార్టీలు కలిసి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) కూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి. అదికాక తెదేపా, తెలంగాణా జనసమితి (టిజెఎస్), సిపిఐలతో కలిపి మరో కూటమి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. 

ప్రధాని మోడీ నియంతృత్వ, నిరంకుశ పోకడలతో అప్రజాస్వామిక పాలనా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక్కడ సిఎం కెసిఆర్ పై కూడా అవే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

“కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏమి చేస్తుందో చెప్పకుండా, తనను గద్దె దించడమే లక్ష్యమని చెప్పుకోవడం దౌర్భాగ్యం” అని సిఎం కెసిఆర్ అని ఎద్దేవా చేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న మహాకూటమిపై ప్రధాని నరేంద్రమోడీ కూడా సరిగ్గా అదే అన్నారు. “మహాకూటమి ఏకైక లక్ష్యం తనను గద్దె దించడమేనని, కానీ దానిలో ప్రధానమంత్రి అభ్యర్ధులు చాలా మందే ఉన్నారని” ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో భాజపాను ఓడించేందుకే ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తూ ప్రజలలో తన ప్రభుత్వం పట్ల అపనమ్మకం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్ళు కృషి చేస్తున్న తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని తెరాస ఆరోపిస్తోంది.    

వచ్చే ఎన్నికలలో తెరాస 100 సీట్లకు పైగా గెలుచుకొంటుందని సిఎం కెసిఆర్ బల్లగుద్ది చెపుతున్నారు. వచ్చే ఎన్నికలలో జాతీయ స్థాయిలో భాజపా 250కు మించి ఎంపి సీట్లు గెలుచుకోబోతోందని అమిత్ షా చెపుతున్నారు. ఈవిధంగా మోడీ, కెసిఆర్ ఇద్దరూ ఇంచుమించు ఒకేరకమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కెసిఆర్ ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీయే శత్రువు. 


Related Post