కౌలురైతులకు భీమా ఇస్తాం: గుత్తా

July 04, 2018


img

కౌలురైతులను రైతులుగా గుర్తించడానికి నిరాకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి రైతుబంధు పధకాన్ని వర్తింపజేయకపోవడంతో వారి ఆగ్రహానికి గురికావలసివస్తోంది. ఇది ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లయింది. ప్రభుత్వం తాజాగా తీసుకొన్న మరో నిర్ణయం ప్రతిపక్షాలకు మళ్ళీ మరో అవకాశం కల్పించినట్లయింది. 

తెలంగాణా రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కౌలురైతులకు రైతుబంధుకు అర్హులు కాకపోయినప్పటికీ, వారిలో 90 శాతం మందికి జీవితభీమా పధకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించాము. ఎందుకంటే వారికి ఎంతో కొంత పొలం ఉంది. దానితోపాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నారు. కనుక అటువంటి వారందరికీ కూడా జీవితభీమా వర్తింపజేయాలని నిర్ణయించాము,” అని చెప్పారు. 

కౌలురైతులను రైతులుగా గుర్తించడానికి నిరాకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వారికి ఎంతో కొంత భూమి ఉందని, వారు కూడా వ్యవసాయం చేసుకొంటున్నారని చెప్పడం విశేషం. కనుక వారికి కూడా జీవితభీమా వర్తింపజేస్తామని ఇపుడు చెప్పడంతో ప్రభుత్వం వారిని రైతులుగా గుర్తించడానికి అంగీకరించినట్లు అయ్యింది. వారు రైతులని తెలిసి ఉన్నప్పుడు మరి వారికి రైతుబంధు పధకాన్ని ఎందుకు వర్తింపజేయలేదు? అంటే ఆ నిర్ణయం తప్పని భావించాల్సి ఉంటుంది. కౌలురైతుల గురించి ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని చెప్పుకొంటున్నప్పటికీ లేదని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. జీవితభీమా పధకానికి కౌలురైతులు అర్హులైనప్పుడు, రైతుబంధు పధకానికి ఎందుకు అర్హులు కారు? అని ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రశ్నించవచ్చు. దీనిపై ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కౌలురైతులకు రైతుబంధు పధకాన్ని కూడా వర్తింపజేయమని కోరవచ్చు. 


Related Post