లక్షమంది ఉద్యోగాలు కోల్పోకతప్పదా?

July 03, 2018


img

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం చేశారు. తాను అధ్యక్షుడుగా ఎన్నికైతే అమెరికన్లకు ఉద్యోగాలు లభించేవిధంగా తన విదేశీవిధానం ఉంటుందని అయన ప్రకటించేవారు. అయన అంత స్పష్టంగా తన మనసులో ఆలోచనలను చెపుతున్నప్పటికీ అమెరికాలో స్థిరపడిన ప్రవాసభారతీయులు ఎందుకో ఆయననే నమ్మారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయితే తమకు మేలు జరుగుతుందని భావించి ప్రవాసభారతీయులు ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అదే పెద్ద పొరపాటని ఇప్పుడు స్పష్టమవుతోంది. 

ట్రంప్ అధ్యక్షుడు కాగానే హెచ్-1 బి వీసాల మంజూరుకు మరింత కటినమైన ఆంక్షలు విధించారు. అక్కడితో ఆపలేదు. ఆ వీసాలపై అమెరికాకు వచ్చి ఉద్యోగాలు చేసుకొంటున్నవారి జీవితభాగస్వాములకు ఉద్యోగాలు ఊడగొట్టడానికి సిద్దం అవుతున్నారు. ఒబామా హయంలో ప్రారంభించిన హెచ్-4వీసాలను పూర్తిగా రద్దు చేసేందుకు ట్రంప్ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒకవేళ అవి రద్దుచేస్తే సుమారు లక్షమంది ప్రవాసభారతీయులు ఉద్యోగాలు కోల్పోతారని తాజా సర్వేలో తేలింది. 

వారు ఉద్యోగాలు కోల్పోతే ఇంటిపనులకే పరిమితంకావలసి ఉంటుంది. భారతదేశంలోనే ఇప్పుడు ఒక్కరు పనిచేస్తే ఇంట్లో అందరూ సుఖంగా బ్రతికలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అమెరికావంటి ఉన్నత జీవనప్రమాణాలు కలిగిన దేశంలో ఒక్కరి జీతంతో కుటుంబపోషణ దాదాపు అసాధ్యమే. కనుక ఉద్యోగాలు కోల్పోయినవారు భారత్ తిరిగి రావలసి ఉంటుంది. 

అక్కడితో ఈ సమస్య సమసిపోదు. అమెరికాలో స్థిరపడినవారి పిల్లలు అక్కడే పుట్టిపెరిగి చదువుకొంటుంటారు కనుక వారు కూడా చదువులు మానుకొని అర్దాంతరంగా భారత్ తిరిగి రావలసిఉంటుంది. కనుక వారి జీవితాలపై కూడా ఇది చాలా ప్రభావం చూపవచ్చు. ఈ సమస్య ఒక్క ప్రవాస భారతీయులకే కాదు..అమెరికాలో స్థిరపడిన అన్ని దేశాలవారికీ ఉనుంది. కనుక ఒకేసారి అనేకలక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకేసారి లక్షలమంది అమెరికా విడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఒకేసారి అంతమంది ఉద్యోగులు వెళ్ళిపోతే వారు పనిచేస్తున్న సంస్థలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసిరావచ్చు. ఇటువంటి సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయి. డోనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న ఇటువంటి దుందుడుకు నిర్ణయాల వలన ప్రవాసులతో పాటు అమెరికా కూడా ఎంతో కొంత మూల్యం చెల్లించుకోక తప్పదని అర్ధమవుతోంది.


Related Post