అదే కెసిఆర్ గొప్పదనం

July 03, 2018


img

గతంలో పాలకులలో ఒక అపోహ నెలకొని ఉండేది. ఐటి లేదా పరిశ్రమల ద్వారా మాత్రమే ఉపాధి, సంపద సృష్టించవచ్చని. కనుక వారు వాటి అభివృద్ధిపైనే ఎక్కువగా దృష్టి పెట్టేవారు. నేటికీ చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇదే విధానంతో ముందుకు సాగుతున్నాయి. కానీ వ్యవసాయం, కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా అంతకంటే ఎక్కువే సంపద సృష్టించవచ్చని కనిపెట్టిన ఘనత ఖచ్చితంగా సిఎం కెసిఆర్ కే దక్కుతుంది. 

అయితే ఇంతకు ముందు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించినవారు ఎవరూ ఈ ఆలోచనలు చేయలేదా? ఇటువంటి పధకాలు అమలుచేయలేదా? అనే సందేహం కలుగవచ్చు. చేశారు...కానీ అశ్రద్ద, అపనమ్మకంతో చేశారు. వాటితో అద్భుతాలు సృష్టించవచ్చని భావించకపోవడం వలన వారి పధకాలు విఫలం అయ్యేవి. అవి కేవలం ప్రజాకర్షక పధకాలుగా మిగిలిపోయేవి. కానీ అవే పధకాలను కెసిఆర్ ఏవిధంగా అమలుచేయిస్తున్నారో..ఎటువంటి ఫలితాలు రాబట్టుతున్నారో ఓసారి చూద్దాం.        

మిషన్ కాకతీయ పధకం ద్వారా చెరువులలో పూడికతీయడంతో సరిపెట్టి ఉండవచ్చు. కానీ అక్కడే సిఎం కెసిఆర్ భిన్నంగా ఆలోచించి వాటిలో చేపపిల్లలను విడిచిపెడితే మత్స్యకారులకు ఉపాధి, దాంతో రాష్ట్రానికి సంపద సృష్టించవచ్చని అనుకొన్నారు. అయన ఆలోచన  సత్ఫలితాలు ఇస్తోందిప్పుడు. 

భారతదేశం వ్యవసాయాధారిత దేశమని మన పాలకులు అందరికీ తెలుసు. కానీ వ్యవసాయానికి సాగునీరు అందించడానికి నిబద్దతతో కృషి చేయకపోవడం వలన నేటికీ అన్నదాతలు దయనీయస్థితిలో ఉన్నారు. తెలంగాణా ఏర్పడి కెసిఆర్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తరువాత తొలిప్రాధాన్యం సాగునీటి రంగానికే ఇచ్చారు. దానితోబాటే 24 గంటలు నిరంతరాయంగా ‘నాణ్యమైన ఉచిత విద్యుత్’ ను కూడా అందించి రైతన్నలకు అండగా నిలిచారు. 

సిఎం కెసిఆర్ దూరదృష్టి కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా అనేక లక్షల ఎకరాలలో పంటలు పండుతున్నాయి. ఆమేరకు రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది. భూగర్భజలాలు పెరుగుతున్నాయి. సిఎం కెసిఆర్ కల సాకారం అయ్యి రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించిననాడు తెలంగాణా రూపురేఖలు సమూలంగా మారిపోవడం ఖాయం.

ఇప్పుడు మారుమూల గ్రామాలలో కూడా మత్స్య సంపద క్రమంగా పెరుగుతోంది. మాంసం ఉత్పత్తి పెరిగింది. ఈవిధంగా మహానగరాల నుంచి మాత్రమే కాకుండా గ్రామాలలో కూడా సంపద సృష్టించవచ్చని, ఎక్కడివారికి అక్కడే ఉపాధి కల్పించవచ్చని సిఎం కెసిఆర్ నిరూపించి చూపుతున్నారు.

గతంలో పశుసంవర్ధక శాఖ మంత్రి పదవి అంటే ఎవరూ చేపట్టడానికి ఇష్టపడేవారు కారు. రాజకీయంగా తక్కువ పలుకుబడి, శక్తి సామర్ధ్యాలున్న వారికి ఆ పదవిని కేటాయిస్తుండేవారు. అందుకు తగ్గట్లుగానే ఆ శాఖ పనితీరు, ఫలితాలు ఉండేవి. కానీ అది ఎంత విలువైనదో ఇప్పుడు అందరికీ అర్ధం అవుతోంది. రాష్ట్ర ఆర్ధికశక్తిని రెట్టింపు చేయగలశక్తి ఆ శాఖకు, గ్రామీణ ప్రాంతాలకు ఉందని రుజువు అవుతోంది. విలక్షణమైన ఆలోచనలను నిబద్దతతో అమలుచేస్తున్న  కారణంగానే సిఎం కెసిఆర్ దేశంలో ఇతర రాజకీయ నాయకులకంటే ఎప్పుడూ ఒక మెట్టుపైనే ఉంటారంటే అతిశయోక్తి కాదు.


Related Post