తెలంగాణా క్రెడిట్ కోసం కొట్లాటలా?

July 03, 2018


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళు పూర్తయింది. తెలంగాణా ఏవిధంగా ఏర్పడిందో అందరికీ తెలుసు. కానీ తెలంగాణా క్రెడిట్ కోసం మళ్ళీ ఇప్పుడు తెరాస, కాంగ్రెస్ పార్టీలు కీచులాడుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెరాస ప్రధానంగా తెలంగాణా సెంటిమెంట్ ను తెరపైకి తెస్తుంటుంది కనుక మళ్ళీ అదే చేస్తున్నట్లు భావించవచ్చు లేకుంటే ఇప్పుడు తెలంగాణా ఎవరు సాధించారనే దానిపై చర్చ లేవనెత్తవలసిన అవసరమే లేదు. మంత్రి కేటిఆర్ ట్విట్టర్ లో ఆ అంశంపై కాంగ్రెస్ పార్టీతో యుద్ధం ప్రారంభించారు. దానికి కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగా స్పందిస్తున్నారు.

“తెలంగాణా ప్రజల పోరాటాలు, బలిదానాల వలన తెలంగాణా ఏర్పాటుచేయక తప్పని అనివార్యపరిస్థితులు ఏర్పడినందునే సోనియా గాంధీ తెలంగాణా ఏర్పాటు చేశారు తప్ప ఆమె తనంతట తానుగా ఇవ్వలేదు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ దయవల్లే తెలంగాణా వచ్చిందని వాదిస్తుంటారు. “అమ్మా లేదు బొమ్మా లేదు..మేమే కోట్లాడి గుంజుకొన్నాము” అంటూ తెలంగాణా ప్రజలు 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించారు,” అని కేటిఆర్ ట్వీట్ చేశారు. 

దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, “సోనియా గాంధీ దయతోనే తెలంగాణా వచ్చిందని ఆమె ఒక దేవత” అని సిఎం కెసిఆర్ శాసనసభలో స్వయంగా చెప్పారు. ఆనాడు తండ్రి చెప్పిన మాటలకు ఇప్పుడు కేటిఆర్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఈవిషయంలో తండ్రి చెప్పింది నమ్మాలా లేక కొడుకు చెప్పింది నమ్మాలా? తండ్రి మాటలతో కేటిఆర్ విభేదిస్తున్నారా? చెప్పాలి,” అని అన్నారు. 

ఆనాడు శాసనసభలో సోనియా గాంధీని పొగుడుతూ కెసిఆర్ చేసిన ప్రసంగం తాలూకు వీడియోను ఉత్తమ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ కూడా కేటిఆర్ కు ధీటుగా బదులిచ్చారు. సోనియా గాంధీ తెలంగాణా ఇవ్వకపోయుంటే మరి ఆనాడు కెసిఆర్ ఆమె కాళ్ళపై పడి ఎందుకు మొక్కారు? మీరందరూ సకుటుంబ సమేతంగా డిల్లీ వెళ్లి ఆమెతో గ్రూప్ ఫోటో ఎందుకు దిగారు? కేటిఆర్ కూడా తన తండ్రిలాగే చాలా అహంభావంతో మాట్లాడుతున్నారు. ఆ తండ్రీకొడుకులకు ప్రజలే తగినవిధంగా బుద్ధిచెపుతారు. సోనియా గాంధీ దయతోనే తెలంగాణా ఏర్పడిందని మీకూ తెలుసు. కానీ ఆ విషయం అంగీకరించడానికి మీకు అహం అడ్డొస్తుంది.మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీయే తెలంగాణా ఇచ్చారని తెలంగాణా ప్రజలందరికీ తెలుసు. ఆమె గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నందుకు వచ్చే ఎన్నికలలో ప్రజలే బుద్ధి చెపుతారు,” అని అన్నారు.


Related Post