డిఎస్ పరిస్థితి ఏమిటో?

July 02, 2018


img

తెరాస సీనియర్ నేత డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున ‘తగిన చర్యలు’ తీసుకోవాలని కోరుతూ సిఎం కెసిఆర్ కు ఒక లేఖ వ్రాశామని నిజామాబాద్ ఎంపి కవిత చెప్పడంతో తెరాసలో కలకలం మొదలైంది. ఆ తరువాత డి.శ్రీనివాస్ సిఎం కెసిఆర్ అపాయింట్ మెంట్ కోరడం, అందుకు అయన అంగీకరించడం జరిగింది. కానీ సిఎం కెసిఆర్ బిజీగా ఉన్నందున అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారని కనుక ‘పిలుపు వచ్చే వరకు’ ఎదురుచూడమని సిఎం కార్యాలయం నుంచి డి.శ్రీనివాస్ కు కబురు వచ్చింది. ఇది జరిగి నేటికి ఐదు రోజులు గడిచిపోయాయి కానీ ఇంతవరకు సిఎం కెసిఆర్ నుంచి పిలుపురాలేదు. అలాగే ఆయన కూడా సిఎం కెసిఆర్ ను కలిసేందుకు మళ్ళీ ప్రయత్నించలేదు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, సిఎం కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకొన్నా తనకు అభ్యంతరంలేదని చెప్పి ఊరుకున్నారు. 

అప్పటి నుంచి ఆ లేఖ గురించి తెరాసలో ఎవరూ మాట్లాడటం లేదు. అంటే డి.శ్రీనివాస్ ను పార్టీ నుంచి బహిష్కరించే ఆలోచన సిఎం కెసిఆర్ విరమించుకున్నారా లేక తాత్కాలికంగా వాయిదా వేశారా? అనే విషయం తేల్చకపోవడంతో డి.శ్రీనివాస్ పరిస్థితి అయోమయంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో తెరాస నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నప్పుడు అయన ఇంకా పార్టీలో కొనసాగి ప్రయోజనం లేదు. కానీ సిఎం కెసిఆర్ ఏ నిర్ణయమూ తీసుకోకపోవడంతో పార్టీలో ఉండాలా లేక కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.


Related Post