అధికారులకు నాగం బెదిరింపు!

July 02, 2018


img

ఇటీవల భాజపాలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన నాగం జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కెసిఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ ప్రాజెక్టులను, ఇటువంటి పనులు చేయడంలో ఏ మాత్రం అనుభవంలేని ఒక సంస్థకు కట్టబెట్టారు. మిగిలిన సంస్థలను పోటీలో నుంచి తప్పించేందుకు ఆ సంస్థకు అనుకూలంగా నిబంధనలు పెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రూ.5,800 కోట్లు అవినీతి జరిగింది. సిఎం కెసిఆర్ కు దమ్ముంటే దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలి. కెసిఆర్ అవినీతిని పూర్తిగా బయటపెట్టేవరకు నా పోరాటం కొనసాగుతుంది. మా పార్టీ అధికారంలోకి రాగానే కెసిఆర్ అవినీతిపనులకు సహకరించిన అధికారులందరి మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపిస్తాము. కాళేశ్వరం ప్రాజెక్టు పేరును అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుగా మార్చుతాము,” అని అన్నారు. 

వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు కానీ నాగం జనార్ధన్ రెడ్డి అధికారులను ఈవిధంగా బెదిరించడం చాలా తప్పు. వారందరూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తమ పనులు చేసుకుపోతుంటారు. ప్రభుత్వం తీసుకొనే విధానపరమైన నిర్ణయాలను అమలుచేస్తున్న అధికారులను జైలుకు పంపిస్తామని ఒక ప్రతిపక్షనేత బెదిరించడం సరికాదు. తమను ఈవిధంగా బెదిరిస్తున్నందుకు అధికారులే ప్రభుత్వానికి పిర్యాదు చేస్తే నాగం జనార్ధన్ రెడ్డి ఇబ్బందిపడే ప్రమాదం ఉంది. రాజకీయనాయకులు ఒకరిపై మరొకరు ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు కానీ మద్యలో అధికారులను, ఉద్యోగులను లాగడానికి ప్రయత్నించకుండా ఉంటే మంచిది. 


Related Post