రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

July 02, 2018


img

తెదేపా నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన రేవంత్ రెడ్డి సోమవారం ఒక సంచలన ప్రకటన చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్-తెదేపాల పొత్తు అనివార్యమని, త్వరలోనే కాంగ్రెస్ నేతలు తెదేపా అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశం అయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్-తెదేపాలు పొత్తుపెట్టుకొని పోటీ చేస్తేనే కెసిఆర్ ను ఓడించగలమని అన్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ సమైక్య రాష్ట్రానికి మేలు కలిగించే అనేకపనులు చేసినప్పటికీ అహంకారంతో ప్రవర్తించడం వల్లనే అధికారం కోల్పోయారు. ఇప్పుడు కెసిఆర్ కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు పతనం తప్పదు. అహంకారంతో విర్రవీగుతూ నిరంకుశపాలన సాగిస్తున్న కెసిఆర్ ను ఓడించడానికి తెదేపా మాతో కలిసివస్తుందని ఆశిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చంద్రబాబు మనసులో మాటలలాగ అనిపిస్తున్నాయి. తెదేపాలో  స్వర్గీయ ఎన్టీఆర్ గురించి ఎవరూ ఆవిధంగా మాట్లాడలేరు. తెలంగాణాలో తెదేపాకు భవిష్యత్ లేదనే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్లు పైకి కనిపిస్తూన్నప్పటికీ, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్-తెదేపాలను కలపాలనే ఆలోచనతోనే ఆయనను చంద్రబాబే కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఉండవచ్చనిపిస్తోంది. అటువంటి ఆలోచన ఉంది కనుకనే బెంగళూరులో కుమారస్వామి ప్రమాణస్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆప్యాయంగా పలకరించి ఉండవచ్చు. కారణాలు ఏవైనప్పటికీ, తెలంగాణాలో కాంగ్రెస్-తెదేపాల పొత్తు అనివార్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేసేశారు. తెదేపా కూడా అందుకు సిద్దంగానే ఉంది కనుక రేవంత్ రెడ్డి చెప్పినట్లు త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి-చంద్రబాబు నాయుడు భేటీ ఉంటుందేమో? 


Related Post