కేటిఆర్ రాజకీయ సన్యాసం..అందుకేనా?

July 02, 2018


img

వచ్చే ఎన్నికలలో తెరాస అధికారంలోకి రాలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మాటకు కట్టుబడి ఉండాలని మంత్రి కేటిఆర్ నిన్న మరోసారి సవాలు విసిరారు. 

ఉజ్వల రాజకీయ భవిష్యత్ ఉన్న మంత్రి కేటిఆర్ పదేపదే రాజకీయ సన్యాసం చేస్తానని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాళ్ళు విసురుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ, అది ఆయనపై కాంగ్రెస్ పార్టీలో ఒత్తిడి పెంచడానికేనని చెప్పవచ్చు. ఇప్పటికే పార్టీలో కొందరు నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించలేరని గట్టిగా నొక్కి చెప్పడానికే బహుశః మంత్రి కేటిఆర్ ఈవిధంగా సవాళ్ళు విసురుతున్నారని భావించవచ్చు. తద్వారా పార్టీలో అయనపట్ల అపనమ్మకం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. 

పార్టీలో ఆయనను వ్యతిరేకిస్తున్న నేతలు ఇప్పటికే డిల్లీవెళ్ళి పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయనపై పిర్యాదులు చేస్తున్నారు. మంత్రి కేటిఆర్ విసురుతున్న ఈ సవాళ్ళ గురించి వారు రాహుల్ గాంధీ చెవిలో వేయకుండా ఉండరు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిపించలేరనే అభిప్రాయం కాంగ్రెస్ అధిష్టానానికి కలిగితే ఆయనను మార్చే ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే టి-కాంగ్రెస్ లో ఆ పదవి కోసం నేతలు కీచులాడుకోవడం తధ్యం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి పరిస్థితి నెలకొంటే ఏమవుతుందో గత ఎన్నికలలోనె అందరూ చూశారు. కనుక మంత్రి కేటిఆర్ రాజకీయ సన్యాసం సవాళ్ళు టి-కాంగ్రెస్ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికేనని భావించవచ్చు. మరి టి-కాంగ్రెస్ నేతలు ఈ ఉచ్చులో చిక్కుకొంటారో లేదో రానున్న రోజులలో తెలుస్తుంది.


Related Post