కొండా సురేఖ ప్రయత్నం ఫలించేనా?

June 30, 2018


img

ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు పార్టీ టికెట్స్ ఆశించేవారు ఏదో ఓ సాకుతో అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాలు చేస్తుంటారు. వరంగల్ నగరానికి ఈ ఆర్ధికసం.లో రూ.300 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలపడానికి      వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ శుక్రవారం పనిగట్టుకొని వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లి మంత్రి కేటిఆర్ ను కలిసారు. ఆ నిధులతో నగరంలో చేపట్టబోతున్న అభివృద్ధి పనుల శంఖుస్థాపనలు చేసేందుకు వరంగల్ రావలసిందిగా ఆమె మంత్రి కేటిఆర్ ను ఆహ్వానించారు. మార్చి 15వ తేదీన బడ్జెట్ కేటాయింపులు జరిగితే ఆమె ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి మంత్రి కేటిఆర్ కు కృతజ్ఞతలు చెప్పడం ఆలోచింపజేస్తోంది. 

వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తానని సిఎం కెసిఆర్ ఎప్పుడో ప్రకటించేశారు. కనుక కొండా సురేఖకు కూడా టికెట్ ఖరారు అయిపోయినట్లే భావించవచ్చు. మరి ఆమె కేటిఆర్ ను ఎందుకు కలిసినట్లు? కేవలం కృతజ్ఞతలు తెలపడానికేనా?

మూడు నాలుగు రోజుల క్రితం వరంగల్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడుతూ, తన కుమార్తె సుస్మితా పటేల్ ఎమ్మెల్యే కావాలని నియోజకవర్గంలో ప్రజలు కొరుకొంటున్నారని, వచ్చే ఎన్నికలలో ఆమెకు కూడా పార్టీ టికెట్ తప్పకుండా లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. కనుక ఆమె తన కుమార్తె సుస్మితా పటేల్ కు టికెట్ కేటాయించమని అడిగేందుకే కేటిఆర్ ను కలిసి ఉండవచ్చు. 

మరి ఆమెకు, ఆమె కుమార్తెకు కూడా టికెట్స్ కేటాయించాలంటే మరొకరు తప్పుకోవలసి ఉంటుంది లేదా కొండా సురేఖ తన సీటును కుమార్తె కోసం త్యాగం చేయవలసి ఉంటుంది. అందుకు ఆమె సిద్దమేనా? తెరాస అధిష్టానం అందుకు అంగీకరిస్తుందా? ఏమో!


Related Post