రాష్ట్ర ద్రోహి ముద్రతో కాంగ్రెస్ అవుట్...అవుతుందా?

June 30, 2018


img

రాష్ట్ర సాగునీటిశాఖా మంత్రి హరీష్ రావు శుక్రవారం గద్వాలలో నడిగడ్డ ప్రగతిసభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన సాగునీటిపధకాల గురించి వివరించిన తరువాత రాజకీయాలు మాట్లాడటం విశేషం. ఇటువంటి బహిరంగసభలలో రాజకీయాలు మాట్లాడటం సహజమే కానీ అయన చాలా లౌక్యంగా కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర ద్రోహి ముద్ర వేయడానికి చేసిన ప్రయత్నం అయన రాజకీయ చతురతకు అద్దం పడుతోంది. 

తెదేపా హయంలో చంద్రబాబునాయుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకొన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి ఏమీ చేయలేదని, పైగా ఇప్పుడు తెలంగాణా ఏర్పడిన తరువాత కూడా ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతూనే ఉందని, అది వచ్చే ఎన్నికలలో తెలంగాణా అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్దం అవుతోందని, వాటి పొత్తు రాష్ట్ర ద్రోహమేనని మంత్రి హరీష్ రావు అన్నారు.

కాంగ్రెస్, తెదేపాల పొత్తుల పట్ల తెరాస ఆందోళన చెందుతోందని చెప్పడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, రాష్ట్రంలో తెదేపా పనయిపోయిందని వచ్చే ఎన్నికల తరువాత అదృశ్యం అయిపోవడం ఖాయమని తెరాస నేతలు గట్టిగా చెపుతున్నపుడు, ఉనికి కోల్పోతున్న ఆ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుంటే భయపడటం ఎందుకు? తెరాస అవునన్నా కాదన్న నేటికీ తెలంగాణాలో తెదేపాకు ఎంతో కొంత గట్టి క్యాడర్ ఉన్న మాట వాస్తవం. కనుక దానితో కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకుంటే ఆ రెండూ కలిసి బలపడి వచ్చే ఎన్నికలలో తెరాసకు గట్టి సవాలు విసిరవచ్చని తెరాసలో చిన్నగా ఆందోళన మొదలైనట్లు కనిపిస్తోంది. తెదేపాతో పొత్తు పెట్టుకొంది కనుక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ద్రోహి ముద్రవేసినా దానికి పడే ఓట్లు పడకుండాపోవు. 


Related Post