కేటిఆర్ చెప్పింది నిజమే..

June 30, 2018


img

తెలంగాణా భవన్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళపాటు దేశాన్ని పాలించింది. అన్నేళ్ళ తరువాత కూడా నేటికీ దేశంలో అనేక గ్రామాలలో విద్యుత్, రోడ్లు, త్రాగునీరు లేదంటే దానికి ఎవరు బాధ్యులు? దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కాదా? దేశానికి, తెలంగాణాకు ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నాలుగేళ్ళలో మేమేమి చేస్తున్నామని ప్రశ్నిస్తున్నారు.       వారే ఈ సమస్యలన్నీ పరిష్కరించి ఉంటే నేడు ఎవరూ ఎవరినీ ప్రశ్నించవలసిన అవసరం ఉండేది కాదు కదా?” అని అన్నారు. 

‘సోనియాగాంధీ దయ తలిచి తెలంగాణా రాష్ట్రం ఇచ్చిందనే’ టి-కాంగ్రెస్ నేతల వాదనలపై కూడా మంత్రి కేటిఆర్ ఘాటుగా స్పందించారు. “సోనియా గాంధీ తెలంగాణా ఇవ్వలేదు. మేమే కాంగ్రెస్ తో కొట్లాడి బలవంతంగా గుంజుకొన్నాము. తెలంగాణా ప్రజలను అంతగా గోస పెట్టినందుకే 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా అదే జరుగబోతోంది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు పారించుడం ఖాయం. ఇంటింటికీ త్రాగునీళ్ళు అందించడం ఖాయం. అలాగే కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ క్రిందికి నీళ్ళు తెచ్చుడు కూడా ఖాయమే. రాష్ట్రంలో మరో 15 ఏళ్ళు కెసిఆరే ముఖ్యమంత్రిగా ఉంటారు,” అని అన్నారు.

తెరాస నేతృత్వంలో జరిగిన మలిదశ ఉద్యమాలతో యూపియే సర్కార్ కు తెలంగాణా ఏర్పాటు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది కనుకనే ఏర్పాటు చేసిందని అందరికీ తెలుసు. ఒకవేళ అన్నేళ్ళు ఉద్యమాలు చేయకుండా, 1,400 మంది యువత బలిదానాలు చేసుకోకమునుపే తెలంగాణా ఏర్పాటు చేసి ఉండి ఉంటే సోనియా గాంధీయే తెలంగాణా ఇచ్చిందని టి-కాంగ్రెస్ నేతలు గర్వంగా చెప్పుకొనే అవకాశం ఉండేది. ప్రజలు కూడా ఎన్నికలలో టి-కాంగ్రెస్ పార్టీనే గెలిపించి ఉండేవారు. కానీ టి-కాంగ్రెస్ నేతలు కూడా తమ అధిష్టానంపై తిరుగబడి తెలంగాణా కోసం పోరాటాలకు సిద్ధమయ్యేవరకు తెలంగాణా ఏర్పాటు చేయలేదు. 

ఇక తెలంగాణా ఏర్పాటుచేయక తప్పదని గ్రహించి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక కూడికలు, తీసివేతలు చేసుకొన్న తరువాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఏర్పాటు చేసింది. కానీ దాని లెక్కలు తప్పని తెలంగాణా ప్రజలు వెంటనే తేల్చి చెప్పేశారు.


Related Post