పవన్..ఇదేంటి?

June 29, 2018


img

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా మెల్లమెల్లగా రాజకీయపార్టీ లక్షణాలను అలవాటు చేసుకొంటున్నట్లుంది.    “ప్రజాసమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలు, వాటి నాయకులే పోరాడాలి కానీ ప్రజలను కూడా రోడ్లపైకి రప్పించి ధర్నాలు, బంద్ లు చేసి ప్రజలకు ఇబ్బంది, ఆస్తినష్టం కలిగించడం సరికాదని” పవన్ కళ్యాణ్ పదేపదే చెప్పేవారు. కానీ ఇప్పుడు అదే జనసేన పార్టీ కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు ఈరోజు  కడప బంద్ కు పిలుపునిస్తే వాటికి సంఘీభావం తెలిపింది. 

“అలాగే అధికారం కోసం కాదు..ప్రశ్నించడం కోసమే రాజకీయాలలోకి వచ్చానని” పదేపదే చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు “ఏపిలో జనసేన పార్టీ అధికారంలోకి తీసుకువద్దామని’ గట్టిగా నొక్కి చెపుతున్నారు. నైతికవిలువల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్, ఇదివరకు తాను విమర్శించిన వైకాపాకు క్రమంగా దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్నారు. కడప బంద్ కు వైకాపా పిలుపునిస్తే దానికి జనసేన సంఘీభావం తెలుపడమే అందుకు తాజా ఉదాహరణ. 

ఈ నాలుగు నెలలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనావిధానంలో వచ్చిన ఈ మార్పులు చూస్తుంటే, జనసేన కూడా మరొక సాధారణ రాజకీయపార్టీగా మారబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక పార్టీ అధినేత విశ్వసనీయత, నాయకత్వ లక్షణాలపైనే ఆ పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ రెండూ కోల్పోతుందో ఆ పార్టీ ప్రజాధారణ కూడా కోల్పోతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తను మొదట చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించడం మొదలుపెడితే జనసేన ప్రజాధారణ కోల్పోవడం ఖాయం. కనుక అడుగు ముందుకు వేసే ముందు అది తన పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఉండలేదా అని తరిచి చూసుకొని ముందుకు సాగడం మంచిది.


Related Post