కెసిఆర్ స్వీయరాజకీయ లబ్ది కోసమే.. డికె అరుణ

June 29, 2018


img

జోగుళాంబ గద్వాల్ జిల్లాలో గట్టు ఎత్తిపోతల పధకానికి ఈరోజు సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ తీవ్ర విమర్శలు చేశారు. 

“గతంలో నేనే ఆ పధకానికి బీజం వేశానని జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ మా పార్టీ అధికారంలో ఉండి ఉంటే దానిని ఎప్పుడో పూర్తి చేసి ఉండేవాళ్ళం. కానీ రాష్ట్రంలో తెరాస అధికారంలోకి రావడం వలన దానిని పూర్తిచేయాలని నేను సిఎం కెసిఆర్ కు పలుమార్లు విజ్ఞప్తి చేశాను. కానీ ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే దానిని ఇంతవరకు మొదలుపెట్టలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గిరపడుతున్నందున దానికి మళ్ళీ శంఖుస్థాపన చేసి జిల్లా ప్రజలను ఆకట్టుకొని రాజకీయలబ్ది పొందాలని చూస్తున్నారు. ఒకవేళ సిఎం కెసిఆర్ కు నిజంగా ఈ పధకం పూర్తిచేయాలనే ఉద్దేశ్యమే ఉంటే నాలుగేళ్ళు ఎందుకు ఆలస్యం చేశారు?” అని డికె అరుణ ప్రశ్నించారు.

ఆమె చెప్పిన మాట వాస్తవమే అయ్యుండవచ్చు. తాము చేపట్టే పనుల వలన తమ పార్టీకి రాజకీయంగా లబ్ది కలగాలని, ఎన్నికలలో గెలవాలని కోరుకోవడం సహజం. కనుక అధికారంలో ఉన్న పార్టీలు ఎప్పుడు ఏ పనిని భుజానికెత్తుకుంటే తమకు ఎక్కువ రాజకీయ లబ్ది కలుగుతుందో లెక్కలు చూసుకొని అప్పుడే వాటిని ఎత్తుకుంటాయి. అధికారపార్టీకి ఆ అడ్వాంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. 

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ అడ్వాంటేజ్ ఉండేది. అప్పుడే డికె అరుణ ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ఉండి ఉంటే ఆమెకు, కాంగ్రెస్ పార్టీలకే ఆ పేరు,ప్రతిష్టలు దక్కేవి కదా. కానీ కాంగ్రెస్ నేతలకు అధికారంలో ఉన్నప్పుడు కుర్చీల కోసం కుమ్ములాటలతోనే సరిపోతుంది. ఇక రాష్ట్రం గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది?కనుక తన గద్వాల్ జిల్లాపై పట్టుసాధించడానికి గట్టు ప్రాజెక్టును తెరాస వాడుకొంటోందని డికె.అరుణ ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. అది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే! 


Related Post