గద్వాల సభలో సిఎం కెసిఆర్ ఎన్నికల శంఖారావం?

June 29, 2018


img

సిఎం కెసిఆర్ శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పధకానికి ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు శంఖుస్థాపన చేయబోతున్నారు. జిల్లాలోని 15 గ్రామాలలో 33,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రూపొదించ బడుతున్న ఈ ప్రాజెక్టుపై రాష్ట్రప్రభుత్వం రూ.553.98 కోట్లు ఖర్చు చేయబోతోంది. దీనికోసం ఆ ప్రాంతంలో 992 ఎకరాలు భూసేకరణ చేయబోతోంది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం పాలాపరమైన అనుమతులు ఇప్పటికే మంజూరు చేసింది.

అనంతరం గద్వాలలో జరిగే బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఇటీవల కెసిఆర్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన చేశారు కనుక ఈ సభలో ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. బహుశః ఆ ఉద్దేశ్యంతోనే నిన్న హటాత్తుగా విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మ మొక్కు చెల్లించుకొని, 2019 ఎన్నికలలో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి ఉండవచ్చు. కాంగ్రెస్ నేతలకు భయం పుట్టేలా ఈ బహిరంగసభను నిర్వహిస్తామని తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఈ సభకు కనీసం 1.50 లక్షలమందిని జనసమీకరణ చేస్తున్నామని, గద్వాల చరిత్రలో ఈ సభ చిరస్థాయిగా నిలిచిపోతుందని, వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బహిరంగ సభ గురించి తెరాస నేతలు చెపుతున్న ఈ మాటలు, సభ కోసం చేస్తున్న బారీ ఏర్పాట్లను చూస్తుంటే ఈ సభలోనే సిఎం కెసిఆర్ ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. మరికొన్ని గంటలలోనే దీనిపై ఎలాగూ సిఎం కెసిఆర్ స్వయంగా స్పష్టత ఇవ్వబోతున్నారు కనుక అంతవరకు వేచిచూడాలి.


Related Post