ఆంధ్రాకాంట్రాక్టర్లకు తక్షణలబ్ది...తెలంగాణాకు శాశ్వితభారం

June 29, 2018


img

తెలంగాణా జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఒక ప్రముఖ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దానిలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా చెప్పారు. 

తెలంగాణా ఏర్పడిన తరువాత ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు ఎందుకు తప్పు పడుతున్నాయి? అనే ప్రశ్నకు సమాధానంగా, “ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవద్దని ఎవరు అన్నారు? తప్పకుండా చేపట్టాలి. అయితే వాటి వలన రైతులకు మేలు కలగాలి. రాష్ట్రానికి మేలు కలగాలి. కానీ వాటివలన ఆంధ్రా కాంట్రాక్టర్లు లబ్ది పొందుతున్నారు.

రూ.9,000 కోట్లు అంచనాలతో ప్రారంభించిన ప్రాజెక్టుల వ్యయం ఏకంగా రూ.25,000 కోట్లకు ఎందుకు పెంచినట్లు? కాంట్రాక్టర్ల కోసమే కదా? వేలకోట్లతో తెలంగాణా ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుల వలన ఆంధ్రాకాంట్రాక్టర్లు తక్షణ లబ్ది పొందుతుంటే, తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టులు తెలంగాణా ప్రజలకు శాస్వితంగా భారంగా మారబోతున్నాయి. అందుకే ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి ముందుకు వెళ్ళమని కోరుతున్నాము. కానీ ప్రభుత్వం ఎవరి మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేదు,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 

కెసిఆర్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన చేయడంపై అడిగిన ప్రశ్నకు ప్రొఫెసర్ కోదండరాం సమాధానం చెపుతూ, “అదొక చవుకబారు రాజకీయగారడీ. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే తెరాసకు 100 సీట్లు వస్తాయని ఒకసారి, 80 సీట్లు వస్తాయని మరొకసారి, 40 మంది ఎమ్మెల్యేల పట్ల ప్రజలలో తీవ్రవ్యతిరేకత నెలకొందని మరొకసారి వార్తలు వస్తుంటాయి. వీటిలో ఏది నిజం? ఒకవేళ 40 మంది ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటే దానర్ధం తెరాస అన్ని సీట్లు కోల్పోతుందనే కదా దానర్ధం. మరి ఏ లెక్కన 100 సీట్లు గెలుచుకొంటామని సిఎం కెసిఆర్ చెపుతున్నారు? 

తమ ప్రభుత్వం చాలా బలంగా ఉందని, తమ ప్రభుత్వ పనితీరు పట్ల రాష్ట్ర ప్రజలందరూ సంతృప్తిగా ఉనారని కనుక వారు తమవైపే ఉన్నారని పదేపదేచెప్పుకొంటూ మళ్ళీ ఇతర పార్టీల నాయకులను ఎందుకు తెరాసలోకి ఫిరాయింపజేసుకొంటున్నారు? తెరాస నిజంగా బలంగా ఉంటే ఇతర పార్టీల నేతలతో మీకేమి పని?” అని ప్రశ్నించారు.

ఉద్యోగాల భర్తీ విషయంపై మాట్లాడుతూ, “రాష్ట్రంలో కొన్నివేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం వాటిని భర్తీ చేసే ప్రయత్నం చేయడం లేదు. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలని మేము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించనేలేదు. నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది,” అని అన్నారు. 

 పంచాయితీ ఎన్నికల గురించి మాట్లాడుతూ, “ఈ ఎన్నికలు మా పార్టీకి రాజకీయంగా బలపడే అవకాశం కల్పిస్తాయని మేము భావిస్తున్నాము. అయితే ఎన్నికలు నిర్వహించేముందు చట్ట ప్రకారం బిసి జనాభా లెక్కలు చెప్పకుండా ముందుకు సాగాలనుకోవడం వలననే తెరాస సర్కార్ కు హైకోర్టులో మొట్టికాయలుపడ్డాయి,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

“వచ్చే ఎన్నికలలో తెలంగాణా జనసమితి (టిజెఎస్) ఓట్లు చీల్చి అధికార పార్టీకి సహాయపడుతుందా?” అనే ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఓట్లు చీల్చి ఎవరికో ప్రయోజనం కలిగించడానికి మేము రాజకీయాలలోకి రాలేదు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగడంలేదు కనుకనే వచ్చాము. వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామని భావిస్తున్నాము. అందుకోసం గ్రామస్థాయి నుంచి మేము మా పార్టీని నిర్మించుకొంటున్నాము కూడా. తెలంగాణా ఉద్యమాలలో పాల్గొన్నవారిని, నిష్కళంక చరిత్ర ఉన్నవారిని మాపార్టీ సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇప్పటికే అనేకమంది ఉద్యమకారులు మా పార్టీలో చేరుతున్నారు కూడా. వారితో కలిసి రాష్ట్ర రాజకీయాలలో మార్పు సాధించడానికి గట్టిగా ప్రయతిస్తాము. ఈరోజుల్లో రాజకీయాలంటే పెట్టుబడిలేని వ్యాపారంగా మారిపోయాయి. దానిని మార్చి ప్రజలే కేంద్రంగా రాజకీయాలు చేయాలని మేము వచ్చాము. మా భావాలతో ఏకీభవిస్తున్న అనేకమంది మాతో చేతులు కలుపుతున్నారు,” అని ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు.

రైతుబంధు పధకం వలన రైతులకు ఏమీ ప్రయోజనం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే భూరికార్డుల ప్రక్షాళన, పాసుపుస్తకాల పేరుతో పేదరైతుల భూములను ప్రభుత్వం గుంజుకొంటోందని ఆరోపించారు. వ్యవసాయరంగంలో తెరాస సర్కార్ అనుసరిస్తున్న విధానాలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయం వ్యక్తం చేశారు.



Related Post