48 నెలలు...50 దేశాలు...355 కోట్లు ప్రధాని ఖర్చు

June 28, 2018


img

తాను ఒక సాధారణ ఛాయ్ వాలానని చాలా గర్వంగా చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోడీ అధికారం చేపట్టిన తరువాత ఒక కార్పోరేట్ వ్యాపారస్తునికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో విదేశీయాత్రలు చేస్తుండటం చూసి దేశప్రజలు విస్మయం చెందుతున్నారు. కానీ ప్రతిపక్షాలు, దేశప్రజలు ఏమనుకొంటున్నప్పటికీ మోడీ తన విదేశీపర్యటనలు మానుకోలేదు కనీసం తగ్గించుకోలేదు. 

గత నాలుగేళ్ళలో అయన మొత్తం 165రోజులు విదేశాలలోనే తిరిగారు. అంటే మూడున్నరేళ్ళు భారత్ లో, ఆరు నెలలు విదేశాలలో ఉన్నారన్నమాట! అయన విదేశీయాత్రల వివరాలను కోరుతూ బెంగళూరుకు చెందిన ఒక ఆర్టిఐ కార్యకర్త సమాచార హక్కు క్రింద అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో దిగ్బ్రాంతి కలిగించే విషయాలు వెలుగుచూసాయి. ప్రధాని నరేంద్రమోడీ గత 48 నెలలలో 50 దేశాలలో పర్యటించారని దాని కోసం కేంద్రప్రభుత్వం రూ. 355 కోట్లు ఖర్చు చేసిందని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.

ప్రధాని నరేంద్రమోడీ తరచూ విదేశీయాత్రలకు ఎందుకు వెళుతుంటారు? వెళ్ళి ఏమి సాధించారు?అని కూడా ఆ ఆర్టిఐ కార్యకర్త ప్రశ్నించి ఉండి ఉంటే ఏమి సమాధానం వచ్చేదో?దేశప్రధానిగా ఎవరు ఉన్నా అప్పుడప్పుడు విదేశీపర్యటనలు చేయకతప్పదు కానీ సగటున ప్రతీ నెలకు ఒకసారి విదేశీపర్యటన చేయడమే ఆక్షేపనీయంగా ఉంది. 

తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణల కారణంగా వందలకోట్లు పొదుపు చేశామని గొప్పగా చెప్పుకొంటూ మరోవైపు విదేశీ పర్యటనల కోసం రూ.355 కోట్లు ఖర్చు చేస్తే ఇక ఏమి మిగిలినట్లు? 

దేశంలో అనేక రాష్ట్రాలలో నిధుల కొరత కారణంగా అనేక ప్రాజెక్టులు నత్తనడకలు నడుస్తున్నాయి. అనేక గ్రామాలు, పట్టణాలలో కనీస మౌలికవసతులు లేవు. ఇక పేదలకు విద్య, వైద్యం, పౌషికాహారం నేటికీ అందని పండే. ఒక వందకోట్లు కేటాయిస్తే సమూలమైన...శాస్వితమైన మార్పులు కలిగేవి ఎన్నో పధకాలు, ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి కోసం ఎంత సొమ్ము కేటాయించినా ఖర్చు చేసినా ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ ఒకపక్క కోట్లాదిమంది నిరుపేదప్రజలు తీవ్ర సమస్యలతో అల్లాడుతుంటే, కేంద్రప్రభుత్వం ప్రధాని విదేశీపర్యటనలపై ఇంతగా ఖర్చుపెట్టడం చాలా ఆక్షేపనీయమే.


Related Post