కౌలు రైతులకు టి-బిజెపి వల?

June 28, 2018


img

తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలు ఎప్పుడూ ‘ఎన్నికల మూడ్’ లోనే ఉన్నాయి కనుక అవి తదనుగుణంగానే చురుకుగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో భాజపా నేతలు కాస్త ఆలస్యంగా మేల్కొన్నప్పటికీ వారు కూడా జనచైతన్య యాత్రలు మొదలుపెట్టి తెరాస, కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా ఎన్నికల హామీలను గుప్పించడం మొదలుపెట్టారు. 

మహబూబ్ నగర్ జిల్లాలో జనచైతన్యయాత్రల సందర్బంగా దేవరకర్ర, నారాయణపేటలో భాజపా బుధవారం బహిరంగ సభలు నిర్వహించింది. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె లక్ష్మణ్ ప్రజలనుద్దేశ్యించి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో రైతులందరికీ రూ.2 లక్షల వరకు పంటరుణాలు మాఫీ చేస్తామని, ప్రతీ ఏటా వాటిపై వడ్డీలను కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 

తెరాస సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు, జీవితభీమా పధకాలను కౌలురైతులకు వర్తింపజేయకపోవడంతో వారు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. కనుక వారిని తమవైపు ఆకర్షించడానికే ఈ పెన్షన్ హామీని ప్రకటించినట్లు అర్ధమవుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల వరకు పంటరుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. కనుక భాజపా దానితో పోటీపడుతూ వడ్డీని కూడా మాఫీ చేస్తానని ప్రకటించింది. 

అధికారం దక్కించుకోవడం కోసం ఆచరణసాధ్యం కాని ఇటువంటి హామీలను ఇవ్వడం చాలా శోచనీయం. యూపి, కర్ణాటక ఎన్నికలలో కూడా భాజపా పంటరుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణాలో ఇస్తోంది. ఇటువంటి హామీలు ఆచరణ సాధ్యమేనని భాజపా నమ్ముతున్నట్లయితే, ఇలాగ ఒక్కో రాష్ట్రంలో వేర్వేరుగా మాఫీ ప్రకటనలు చేసేబదులు, ఇప్పుడు కేంద్రంలో ఎలాగూ భాజపా ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక అన్ని రాష్ట్రాలలో రైతుల పంటరుణాలను మాఫీ చేస్తామని దానిచేత ప్రకటింపజేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటే బాగుంటుంది. అప్పుడు దేశప్రజలు కూడా దానిని నమ్మి ఓట్లేసే గెలిపిస్తారు కదా?


Related Post