వద్దంటే విన్నారు కాదు...

June 28, 2018


img

తెలంగాణాలో అనేక జిల్లాలలో రైతులు ఈసారి తమ తొందరపాటుకు బారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. జూన్ మొదటివారం నుంచి వానలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. అది చెప్పినట్లుగానే చాలా ప్రాంతాలలో తొలకరివానలు పడ్డాయి కూడా. కానీ నైరుతీ రుతుపవనాల కదలికలలో మార్పుల కారణంగా అకస్మాత్తుగా మారిన వాతావరణ పరిస్థితులను గమనించిన వాతావరణశాఖ అధికారులు వెంటనే మరొక ప్రకటన విడుదల చేశారు. మరో రెండువారాల వరకు అంటే జూన్ నెలాఖరు వరకు వానలుపడే అవకాశం లేదని దానిలో పేర్కొన్నారు. అది చూసి వ్యవసాయ అధికారులు రాష్ట్రంలో రైతన్నలను హెచ్చరించారు. తొందరపడి నాట్లు వేసుకోవద్దని, నిలకడగా వర్షాలు పడినప్పుడే నాట్లు వీసుకోవాలని లేకుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. 

కానీ రైతన్నలు వారి హెచ్చరికలను పట్టించుకోకుండా తొలకరి వానలుపడగానే విత్తనాలు వేసేశారు. ముఖ్యంగా నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలలో పత్తిరైతులు విత్తనాలు వేసేశారు. మరికొన్ని జిల్లాలో వరి పండించే రైతులు కూడా వ్యవసాయ అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా వరినాట్లు వేసేశారు. ఆ తరువాత ఒక్క చినుకు పడలేదు. పైగా గత రెండు వారాలలో రాష్ట్రంలో వేసవిని తలపించేవిధంగా ఎండలు మండిపోయాయి. ఎక్కడ చూసినా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆ కారణంగా వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. మొలకెత్తినా బలంగా రాలేదు. బోరుబావులున్నవారు వాటిని కాపాడుకునేందుకు చాలా శ్రమిస్తున్నారు. కానీ తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా చాలాచోట్ల పత్తిమొలకలు నేలరాలిపోయాయి. దాంతో మళ్ళీ రెండవసారి విత్తనాలు కొని వేయడానికి సిద్దం అవుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పధకం క్రింద ఇచ్చిన రూ.4,000 తమ తొందరపాటు వలన వృధా అయిపోయాయని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాలలో పత్తిరైతులు బాధపడుతున్నారు. వరినాట్లు వేసిన రైతుల పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉన్నప్పటికీ వారు బోరుబావులతో నీరు అందిస్తూ బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా వానలు మొదలైతేచాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు. కానీ జూన్ నెలాఖరు వచ్చేసినా ఇంతవరకు వర్షాలు మొదలవకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈసారి వరుణదేవుడు రైతన్నలకు హ్యాండిచ్చేశాడు! ఇంకా ఎప్పుడు కరుణిస్తాడో?


Related Post