డిఎస్ విషయంలో చాలా ఓపిక పట్టాము: కవిత

June 27, 2018


img

తెరాసలో డి శ్రీనివాస్ కధ క్లైమాక్స్ కు చేరుకున్నట్లే ఉంది. తెరాస ఎంపి కవిత ఈరోజు తన నివాసంలో నిజామాబాద్ జిల్లా తెరాస నేతలతో సమావేశం అయ్యారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “డిఎస్ విషయంలో మేము చాలాకాలం ఓపిక పట్టాము. అయన తన కుటుంబం కోసం మా పార్టీని ఇబ్బందిపెట్టినప్పటికీ సహించాము. కానీ పార్టీకి నష్టం కలిగించేవిధంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకోలేము కదా? తప్పు చేస్తే ఎవరినీ పార్టీ ఉపేక్షించదు. డిఎస్ అందుకు అతీతులు కారు. అయన వ్యవహారాల గురించి సిఎం కెసిఆర్ కు లేఖద్వారా పిర్యాదు చేశాము. డిఎస్ విషయంలో ఆయనే తగిన నిర్ణయం తీసుకుంటారు,” అని చెప్పారు. 

కవిత నివాసంలో జరిగిన సమావేశం గురించి తెలుసుకున్న డిఎస్, అయన కుమారుడు అరవింద్ ఇద్దరూ స్పందించారు. డిఎస్ మాట్లాడుతూ, “నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నష్టం కలిగించే పనులు ఎప్పుడూ చేయలేదు. జిల్లా నేతలు నాగురించి ఏమి మాట్లాడుకున్నారో, ఏమి పిర్యాదు చేశారో నాకు తెలియదు. తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. ప్రస్తుత పరిస్థితులలో నేనేమి మాట్లాడదలచుకోలేదు,” అని అన్నారు. 

అయన కుమారుడు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ, “ఎంపి కవిత నిజామాబాద్ జిల్లాకు అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చిపోతుంటారు. గత నాలుగేళ్ళలో జిల్లాలో ఆమె కనబడలేదు కనుక జిల్లా అభివృద్ధికి ఆమె చేసిందేమీ లేదు. మా కుటుంబం జిల్లాలో యాక్టివ్ గా పనిచేస్తుండటంతో మేము తనకు ఎక్కడ పోటీగా మారుతామో అనే భయంతోనే ఆమె ఈరోజు హడావుడిగా జిల్లా నేతల సమావేశం ఏర్పాటు చేసి మా తండ్రిగారిపై లేనిపోని ఆరోపణలు చేశారని భావిస్తున్నాము. ఆమె కనుసన్నలలో పనిచేసే తెరాస నేతలు అందరూ కలిసి మా తండ్రిగారిని పార్టీ బయటకు పంపించేయాలని ప్రయత్నిస్తున్నారు. మా నాన్నగారు డిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలను కలిసారని చెపుతున్నారు. మీ ప్రభుత్వం చేతిలోనే ఇంటలిజెన్స్ ఉంది కదా..వారిచేత దర్యాప్తు చేయించుకొని నిజానిజాలు తెలుసుకోవచ్చు కదా?” అని అన్నారు. 

ఒకవేళ ముఖ్యమంత్రి నుంచి పిలుపువస్తే కలిసి మాట్లాడాలని డిఎస్ భావిస్తున్నారు. పిలుపురాకపోతే తెరాసకు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తాజా సమాచారం. అంటే తెరాసలో డిఎస్ కధ క్లైమాక్స్ కు చేరుకున్నట్లు భావించవచ్చు.


Related Post