ఏపి, తెలంగాణా తీరులో ఎంత తేడా!

June 27, 2018


img

ఒకే సమస్యపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రప్రభుత్వాలు పూర్తి భిన్నమైన తీరును చూసే అవకాశం మరోమారు లభించింది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో తెలంగాణా ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తుంటే, కడప ఉక్కు కర్మాగారం కోసం ఏపిలో తెదేపా ప్రభుత్వం విద్వంసకర పద్దతిలో ముందుకు సాగుతుండటం విశేషం. 

బయ్యారం, కడపలో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పగానే, తెలంగాణా ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి బయ్యారంలో రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను అధ్యయనం చేయవలసిందిగా ఆదేశించింది. 

కమిటీ అనగానే నివేదిక సమర్పించడానికి ఏడాదో రెండేళ్లో సమయం ఇచ్చి కాలక్షేపం చేయాలనుకోకుండా కేవలం నెలరోజులలోగా నివేదిక ఇవ్వాలని గడువు విధించింది.  ఆ నివేదిక వచ్చేవరకు చేతులు ముడుచుకొని కూర్చోకుండా, రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ డిల్లీ వెళ్లి బుధవారం ప్రధాని నరేంద్రమోడీని కలిసి బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయవలసిందిగా మరోసారి అభ్యర్ధించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్నివిధాల అనుకూలమైనదని చెప్పారు. స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) నేతృత్వంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేమాటయితే రాష్ట్రప్రభుత్వం తరపున అనేక రాయితీలు ఇస్తామని నచ్చజెప్పారు. తాను చెప్పినదంతా విన్న తరువాత దీనికి సంబంధించి మరికొన్ని వివరాలను సమర్పించవలసిందిగా ప్రధాని నరేంద్రమోడీ కోరారని మంత్రి కేటిఆర్ చెప్పారు. ఒకవేళ కేంద్రం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకు రాకపోతే తెలంగాణా ప్రభుత్వమే స్వంతడబ్బుతో దానిని నిర్మిస్తుందని మంత్రి కేటిఆర్ మీడియాకు చెప్పారు. 

తెరాస సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ ఒక సానుకూల దృక్పధంతో నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని అర్ధం అవుతుంది. కానీ ఏపి సర్కార్ ఇందుకు పూర్తి భిన్నంగా ఈ సమస్యపై నిరాహారదీక్షలు, ధర్నాలు, రహదారుల దిగ్బంధం చేస్తూ రాష్ట్రప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. 

అదిచూసి ఈ పోటీలో తాను ఎక్కడ వెనుకబడిపోతాననే భయంతో వైకాపా కూడా ఉక్కు సంకల్పదీక్షలు మొదలుపెట్టేసింది. 

తెదేపా, వైకాపాలు పోటాపోటీగా చేస్తున్న ఈ దీక్షలు, దర్నాల వలన కడప ఉక్కు కర్మాగారం రాదని అందరికీ తెలుసు. మరి ఎందుకు చేస్తున్నాయంటే, దీనితో తమ రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బతీసి, ప్రజలను తమవైపు తిప్పుకొని రాబోయే ఎన్నికలలో గెలవడం కోసమేనని చెప్పకతప్పదు. నాలుగేళ్ళ క్రితం ఆ రెండు పార్టీలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ ఇలాగే డ్రామాలు ఆడి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించాయి. మళ్ళీ ఇప్పుడు అలాగే ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ పార్టీల రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే ఇటువంటి పార్టీలు కలిగి ఉండటం ఏపి ప్రజల దురదృష్టమేనని చెప్పకతప్పదు. ఇటువంటి పరిస్థితులలో ప్రజల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా వాటి రాజకీయ చదరంగంలో పావుగా మిగిలిపోవడం ఇంకా దురదృష్టకరం. 


Related Post