అయితే డిఎస్ కు డేట్ దగ్గరకు వచ్చేసిందా?

June 27, 2018


img

డిఎస్ గా అందరికీ సుపరిచితులైన తెరాస నేత డి.శ్రీనివాస్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తెరాసలో ఆశించినంత గుర్తింపు లభించకపోవడమే అందుకు కారణం. ఆ కారణంగానే అయన కుమారుడు అరవింద్ భాజపాలో చేరిపోయారు. కానీ డిఎస్ నేటికీ తెరాసలోనే కొనసాగుతున్నారు. తాజా సమాచారం ఏమిటంటే, నిజామాబాద్ ఎంపి కవిత బుధవారం తన నివాసంలో జిల్లా తెరాస నేతలతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా వారు డిఎస్ పై కవితకు అనేక పిర్యాదులు చేసినట్లు సమాచారం. డిఎస్ ఇటీవల రహస్యంగా డిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడుకొని వచ్చారని వారు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆయన వలన తెరాసకు ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోగా, అయన చేస్తున్న పార్టీ వ్యతిరేక కార్యక్రమాల వలన, పార్టీలో ముఠాలను ప్రోత్సహిస్తున్న కారణంగా పార్టీకి చాలా నష్టం కలుగుతోందని కనుక ఆయనపై తక్షణం ‘చర్యలు’ తీసుకోవలసిందిగా సిఎం కెసిఆర్ ను తాము కోరాలనుకొంటున్నామని తెరాస నేతలు ఎంపి కవితకు తెలిపినట్లు సమాచారం. 

‘చర్యలు’ అంటే పద్దతిగా బయటకు సాగనంపడం అని వేరే చెప్పనవసరం లేదు. డిఎస్ కూడా తెరాస నుంచి బయటపడాలనే కోరుకొంటున్నారు కనుక పార్టీ మారడానికి ఆయనకు మార్గం సుగమం అయినట్లే భావించవచ్చు. అయితే కొడుకు భాజపాలో చేరితే అయన మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరాలనుకొంటున్నట్లయితే విశేషమే. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆయనవంటి బలమైన నేత అవసరం చాలా ఉంది కనుక అయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించవచ్చు.  

ఎంపి కవితతో ఈరోజు సమావేశమైనవారిలో ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, షకీల్, జీవన్ రెడ్డి, తెరాస నేతలు తుల ఉమా, ప్రశాంత్ రెడ్డి, బీబీ పాటిల్ తదితరులున్నారు.


Related Post