రైతుబంధుపై హైకోర్టులో పిటిషన్

June 26, 2018


img

తెరాస సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుబంధు పధకంపై హైకోర్టులో ప్రజాహితవాజ్యం దాఖలైంది. ఆ పధకంలో అర్హులైన పేదరైతులకంటే భూస్వాములు, రాజకీయ నాయకులకే ఎక్కువ లబ్ది కలుగుతోందని, కనుక దాని  విధివిధానాలను మార్చాలని కోరుతూ నల్గొండకు చెందిన యాదగిరి రెడ్డి అనే రైతు హైకోర్టుకు ఒక లేఖ వ్రాయగా దానినే ప్రజాహిత వాజ్యం (పిల్)గా స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. దీనిపై రెండు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణను జూలై 10కి వాయిదా వేసింది. 

రైతుబంధు పధకం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నమాట వాస్తవం. కానీ కౌలు రైతులకు, వివిద కారణాల చేత పట్టాదారు పాసుపుస్తకాలను పొందలేని రైతులకు ఈ పధకాన్ని వర్తింపజేయకపోవడంతో వారు తీవ్రఆగ్రహంతో ఉన్నారు. నిజానికి రాష్ట్రంలో కౌలు రైతులు దుర్భరస్థితిలో వ్యవసాయం చేస్తుంటారు. కానీ వారికి ప్రభుత్వం నుంచి ఒక్క నయాపైసా సహాయం అందదు. ఎందుకంటే ప్రభుత్వం వారిని రైతులుగానే గుర్తించడానికి ఇష్టపడటం లేదు. కౌలురైతులకు రైతుబందు పధకం వర్తింపజేయడంలో చిక్కులు ఉన్నమాట వాస్తవమే. కానీ వారికి కూడా ప్రభుత్వ సహాయం అందేవిధంగా ఏదో ఒక మార్గం చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని చెప్పక తప్పదు. 

ఇక అరెకరం ఉన్న రైతుకు కేవలం రూ.2,000 లభిస్తే, అదే..50 ఎకరాలున్న భూస్వామికి రెండు లక్షలు అందుకున్నాడు. నిజానికి అంత భూమి ఉన్నభూస్వామికి ప్రభుత్వం సహాయం అవసరమే ఉండదు. అరెకరం ఉన్న రైతుకే డబ్బు ఎక్కువ అవసరం. కానీ ఎక్కువ అవసరమున్న పేదరైతుకు తక్కువ సొమ్ము, అవసరం లేని భూస్వామికి ఎక్కువ సొమ్ము ప్రభుత్వం అందిస్తోంది. ఈ పధకంలో ఇదే అతిపెద్ద లోపంగా కనిపిస్తోంది. 

సాధారణంగా పేదరైతులకు 5-10 ఎకరాలకు మించి పొలం ఉండదు. ఈ పధకం నిజంగా పేదరైతుల కోసమే నిర్దేశించినదైతే, 5 లేదా 10 ఎకరాలలోపు పొలం ఉన్నవారికే వర్తింపజేయాలి లేదా రైతు ఆర్ధికపరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ఈ పధకాన్ని వర్తింపజేయవచ్చు. కానీ వ్యవసాయం చేస్తున్నవారందరికీ వర్తింపజేయడం వలననే నిజంగా అవసరమున్న రైతులకు ప్రభుత్వ సహాయం అందడం లేదని చెప్పవచ్చు. కనుక కౌలురైతులకు, పేద రైతులకు ఉపయోగపడే విధంగా రైతుబంధు పధకం విధివిధానాలు రూపొందిస్తే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం దక్కుతుంది రైతన్నలు సంతోషించి ప్రభుత్వాన్ని దీవిస్తారు. లేకుంటే ఏ పధకం ద్వారా ప్రభుత్వం మంచిపేరు సంపాదించుకోవాలని భావిస్తోందో సరిగ్గా అదే పధకం కారణంగా హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకోవలసివచ్చినా ఆశ్చర్యం లేదు.


Related Post